అరటిపండ్లు నల్లగా మారుతున్నాయా? ఇలా చేస్తే, అవి 2 వారాల వరకు తాజాగా ఉంటాయి.

ఇనుము, కాల్షియం, విటమిన్ ఎ, బి వంటి పోషకాలు అధికంగా ఉండే అరటిపండును ప్రతిరోజూ తింటే చాలా మంచిది. కానీ ఇథిలీన్ వాయువు కారణంగా అరటిపండ్లు వేగంగా పక్వానికి వస్తాయి.


ఇంటికి తెచ్చిన మరుసటి రోజే గోధుమ రంగులోకి మారిపోతాయి. రెండు మూడు రోజుల్లోనే నల్లగా మారిపోతాయి. అందుకనే చాలామంది చౌకధరకు వచ్చినా పెద్ద మొత్తంలో అరటిపండ్లు కొనేందుకు సంకోచిస్తుంటారు. కానీ, సరైన పద్ధతుల్లో నిల్వ చేస్తే అరటిపండ్లు ఎక్కువకాలం తాజాగా ఉంటాయి. 2 వారాల వరకూ ఏ భయమూ లేకుండా రుచికరమైన అరటిపండ్లను ఆస్వాదించవచ్చు.

అరటిపండ్లను అమ్మేవారంతా దాదాపు పాలిథీన్‌ కవర్లోనే ప్యాక్ చేస్తారు. కానీ మీరు ఇంటికి చేరిన వెంటనే అరటిపండ్లను కవర్ నుంచి బయటకు తీయాలి. ఎందుకంటే, మీరు అరటిపండ్లను తెచ్చిన సంచిలో ఇథిలీన్ వాయువు పేరుకుపోయి ఉంటుంది. అలాగే ఉంచడం వల్ల మరింత వేగంగా పక్వానికి వచ్చి నల్లబడిపోతాయి.

వేరుచేయండి

అరటిపండ్లను గుత్తి నుంచి వేరు చేసి పొడి ప్రదేశంలో నిల్వచేయండి. అప్పుడు ఇథిలీన్ వాయువు విడుదల ప్రక్రియ నెమ్మదిస్తుంది. తద్వారా వాటికి గోధుమ రంగు మచ్చలు రావు.

ప్లాస్టిక్‌తో చుట్టండి

అరటిపండ్ల కాండం లేదా పైభాగం నుంచే ఇథిలీన్ వాయువు విడుదలవుతుంది. అక్కడ అరటిపండ్ల గుత్తులు ఒకదానికొకటి అతుక్కుపోయి ఉంటాయి. ఆ భాగాన్ని ప్లాస్టిక్‌తో చుట్టడం వల్ల అరటిపండ్లు త్వరగా రంగు మారవు.

ఎండ, వేడి నుంచి రక్షణ

ప్రత్యక్ష సూర్యకాంతి పడే చోట లేదా వేడి ఎక్కువగా ఉండే ప్రదేశంలో ఉంచితే అరటిపండు వేగంగా పండడం ప్రారంభమవుతుంది. కాబట్టి, వీటిని ఎల్లప్పుడూ చల్లని, చీకటి ప్రదేశంలోనే ఉంచండి. ఇంకా ఇతర పండ్లు, కూరగాయలకు దూరంగా ఉంచండి

ఫ్రిజ్‌లో ఎలా నిల్వ చేయాలి?

అరటిపండ్లు పక్వానికి వచ్చే వరకు రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయడం మంచిది కాదు. కానీ అవి పక్వానికి వచ్చిన తర్వాత బయట ఉంచకూడదు. అరటిపండ్లు పండిన తర్వాత వాటిని రిఫ్రిజిరేటర్‌లో ఉంచితే ఒకటి నుండి రెండు వారాల వరకు చెడిపోవు.

పండినప్పుడు ఇథిలీన్ వాయువును విడుదల చేసేది అరటిపండు ఒక్కటే కాదు. యాపిల్స్, బేరి పండ్లు, బంగాళాదుంపలు, అవకాడోలు కూడా ఇథిలీన్ వాయువును విడుదల చేసే కొన్ని పండ్లు, కూరగాయలు. కాబట్టి, ఎల్లప్పుడూ వీటికి అరటిపండ్లను దూరంగా ఉంచాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.