ఏపీఎస్ఆర్టీసీకి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం వ్యవహారంలో.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం విమర్శలను ఎదుర్కొంటోంది.
ఈ పథకాన్ని ప్రారంభించిన రెండో రోజే.. ఉచిత ప్రయాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన పల్లె వెలుగు బస్సుల్లో కూడా స్త్రీ శక్తి పథకం వర్తించదు అనే స్టిక్కర్లు అంటించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ స్టిక్కర్లు అంటించడానికి కారణాలు లేకపోలేదని అంటున్నారు.
ఘాట్ రోడ్లు ఉన్న కొన్ని మార్గాల్లో రాకపోకలు సాగించే బస్సులకు ప్రయాణికుల భద్రత దృష్ట్యా స్త్రీ శక్తి పథకం వర్తించదు అనే స్టిక్కర్లను అతికించాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భాకరాపేట, రామసముద్రం ఘాట్ రోడ్ మీదుగా.. మదనపల్లి- రామసముద్రం రూట్లల్లో ప్రయాణించే మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతి లేదని సమాచారం.
తాజా పరిణామాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మండిపడ్డారు. ఉచిత బస్సు పేరుతో మహిళా ఆశలను బస్ టైర్ల కింద తొక్కేశారంటూ ధ్వజమెత్తారు. శనివారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉచిత బస్సు ప్రయాణం పేరుతో మహిళను మోసం చేశారంటూ చంద్రబాబు సర్కార్‌ను నిలదీశారు.
దుర్గమ్మ పాదాల చెంత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మహిళను మోసం చేశారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 16 రకాల బస్సులు ఉంటే కేవలం అయిదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతి ఇచ్చారని, ఎన్నికలు ముందు రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్సుల్లో ప్రయాణం చేయొచ్చంటూ హామీ ఇచ్చారని అన్నారు.
శ్రావణ శుక్రవారం రోజున మహిళలను మోసగించారని వరుదు కళ్యాణి విమర్శించారు. మహిళలను మోసం చేయడం సూపర్ హిట్ నా..?. చీఫ్ మినిస్టర్ అంటే చంద్రబాబు చీటింగ్ మాస్టర్‌గా మారారు. కూటమి ప్రభుత్వం అంటే కోతల ప్రభుత్వంగా మారింది” అని వరుదు కల్యాణి ఆరోపించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్ని రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణానికి మహిళలకు అనుమతి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. 10, 15 బస్సులు మారితే గానీ తిరుపతి వెళ్లడం సాధ్యం కాదు. లగేజీతో మహిళలు 15 బస్సులు మారి తిరుపతి వెళ్లగలరా?. తిరుపతి శ్రీకాళహస్తి కాణిపాకం అన్నవరం, విజయవాడ నో ఫ్రీ బస్.. రెండున్నర కోట్ల మంది మహిళను మోసం చేశారు.. అని అన్నారు.
చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానాల ఖర్చు తగ్గించుకుంటే మహిళలు అందరూ అన్ని బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని వరుదు కల్యాణి కళ్యాణి వ్యాఖ్యానించారు.
































