నోటితో గాలి పీల్చుకుంటున్నారా? అయితే జాగ్రత్త.. మీ హెల్త్ రిస్క్​లో ఉన్నట్టే

ఉదయం నిద్ర లేచినప్పుడు నోరు పొడిగా ఉంటుందా? లేదా దిండుపై లాలాజలం మరకలు ఉన్నాయా? ఇది రాత్రుళ్లు నోటి ద్వారా శ్వాస తీసుకుంటున్నాము అనే దానికి గుర్తు.


వినడానికి ఇది కామన్​గానే ఉన్నా.. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి అనేక విధాలుగా హాని కలుగుతుందని చెప్తున్నారు నిపుణులు. చాలామంది దీనిని ఒక అలవాటుగా చూస్తారు కానీ.. ఇది ఆరోగ్యంపై చాలా నెగిటివ్గా ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే మన శరీరం ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడానికి డిజైన్ చేయబడింది. ముక్కు ద్వారా శ్వాస తీసుకున్నప్పుడు.. గాలి ముక్కు ద్వారా శుభ్రంగా వెళ్లి వెచ్చగా, తేమగా మారుతుంది.

ముక్కు లోపల చిన్న సిలియా, శ్లేష్మం ఉంటాయి. ఇవి ధూళి, కాలుష్యం, బ్యాక్టీరియా వంటి వాటిని నిరోధిస్తాయి. ఇది ఊపిరితిత్తులకు చేరే గాలిని శరీరానికి మరింత మంచిదిగా చేస్తుంది. కానీ ఏదైనా కారణం వల్ల ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం కష్టమైతే.. శరీరం తనంతట తానుగా నోటి ద్వారా శ్వాస తీసుకోవడం ప్రారంభిస్తుంది. ఈ అలవాటు ఎక్కువ కాలం కొనసాగితే.. ఆరోగ్యానికి ఇబ్బంది వస్తుంది. కాబట్టి ముక్కుకు బదులుగా నోటి ద్వారా శ్వాస ఎందుకు తీసుకుంటారో.. దాని ప్రభావం ఆరోగ్యంపై ఎలా ఉంటుందో చూసేద్దాం.

ముక్కు దిబ్బడ

చలికాలంలో జలుబు, అలెర్జీలు లేదా సైనస్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో ముక్కు దిబ్బడ ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితిలో ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. కాబట్టి శరీరం నోటిని ఉపయోగిస్తుంది.

ఎడినాయిడ్స్ లేదా టాన్సిల్స్

పిల్లల్లో ఎడినాయిడ్స్ లేదా టాన్సిల్స్ తరచుగా పెరుగుతాయి. ఇది ముక్కు మార్గాన్ని మూసివేస్తుంది. దీని కారణంగా కూడా ముక్కుకు బదులుగా నోటి ద్వారా శ్వాస తీసుకుంటారు.

ముక్కు లోపల లోపం

ఎవరికైనా సెప్టమ్ వంకరగా ఉంటే లేదా ముక్కులో పాలిప్స్ ఉంటే.. గాలి మార్గం క్లోజ్ అవుతుంది. దీని కారణంగా కూడా ముక్కుకు బదులుగా నోటి ద్వారా శ్వాస తీసుకుంటారు.

దవడ నిర్మాణం

కొంతమంది ముఖం లేదా దవడల నిర్మాణం వల్ల నోరు కొద్దిగా తెరిచి ఉంటుంది. దీని వలన నోటి ద్వారా శ్వాస తీసుకోవడం సులభం అవుతుంది.

అలవాటు

చాలాసార్లు చిన్నతనంలో బొటనవేలు పెట్టుకునే అలవాటు లేదా పదేపదే నోరు తెరిచి ఉంచడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది.

స్లీప్ అప్నియా

ఇది నిద్రకు సంబంధించిన సమస్య. దీనిలో నిద్రపోయేటప్పుడు శ్వాస ఆగిపోతుంది. ఈ స్థితిలో కూడా ప్రజలు నోరు తెరిచి శ్వాస తీసుకోవడం ప్రారంభిస్తారు.

ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే

నోటితో గాలి పీల్చుకోవడం వల్ల ఆరోగ్యానికిి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. లాలాజలం నోటిని శుభ్రంగా, తేమగా చేస్తుంది. కానీ నోటి ద్వారా శ్వాస తీసుకున్నప్పుడు పొడిబారిపోయి లాలాజలం ఆరిపోతుంది. దీని వలన బ్యాక్టీరియా పెరుగి నోటి నుంచి దుర్వాసన వస్తుంది. లాలాజలంలో దంతాలను బలంగా ఉంచే ఖనిజాలు ఉంటాయి. నోరు పొడిబారడం వల్ల అవి తగ్గి చిగుళ్ల వాపు, పళ్లు వదులుగా మారడం జరుగుతుంది. నోటి ద్వారా శ్వాస తీసుకోవడం వల్ల నిద్ర నాణ్యత తగ్గుతుంది. స్లీప్ అప్నియాకు కారణం అవుతుంది. దీనివల్ల మెదడుకు తగినంత ఆక్సిజన్ అందదు. దీని ఎఫెక్ట్ పగులు ఉంటుంది. అలసట, చికాకుతో పాటు దేనిపై ఫోకస్ చేయలేరు.

పిల్లలకు ఈ అలవాటు ఉంటే దంతాల పెరుగుదలపై ప్రభావం ఉంటుంది. ఈ అలవాటు వల్ల పిల్లల ముఖం పొడవుగా, దవడ సన్నగా మారవచ్చు. దంతాలు వంకరగా మారవచ్చు. భవిష్యత్తులో ఆర్థోడోంటిక్ చికిత్స అవసరం కావచ్చు. నోటి ద్వారా శ్వాస తీసుకున్నప్పుడు శరీరంలో ఆక్సిజన్ పరిమాణం తగ్గుతుంది. దీని వలన మెదడు సరిగ్గా పనిచేయదు. కాబట్టి వీలైనంత వరకు వైద్యుల సహాయం తీసుకుంటే మంచిది. అసలు దేనివల్ల సమస్య వచ్చిందో గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలావరకు ఈ ప్రాబ్లమ్ దూరమవుతుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్ను సంప్రదించాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.