దేశంలో ప్రముఖ ఫార్మసీ రిటైలర్ మెడ్ ప్లస్ తీరుపై కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెడిసిన్ కొనుగోళ్లపై ‘లొకేషన్ సర్ చార్జ్ ఫీ’ (Location Surcharge) వసూలు చేయడంపై సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు.
మెడ్ ప్లస్ (Med Plus) తీరు పట్టబగలే దోపిడిలా ఉందని పలువురు కస్టమర్లు తాము కొనుగోలు చేసిన మెడిసిన్ కు సంబంధించిన బిల్లులను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. తమకు తెలియకుండానే గుట్టుగా ఈ దోపిడీ సాగుతోందని తామంతా ఇప్పుడే గమనిస్తున్నామని నెటిజన్లు పోస్టులతో ఈ వ్యవహారం ఇప్పుడు వైరల్ గా మారింది.
ఈ లొకేషన్ సర్ చార్జి అంశంపై ఓ నెటిజన్ పోస్టు చేస్తూ.. కస్టమర్ కు తెలియకుండా నా బిల్లులో ఈ లొకేషన్ సర్ చార్జ్ ఫీజు ఎందుకు కలిపారు? కొన్ని నెలలుగా నేను మెడిసిన్ కొనుగోలు చేస్తున్నాను. కానీ ఈ చార్జి ఇప్పుడే కనిపించింది. రిఫండ్ కోసం కస్టమర్ కేర్ కు కాల్ చేస్తే మెడ్ ప్లస్ లో రిఫండ్ పాలసీ లేదని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. మరో నెటిజన్ పోస్టు చేస్తూ.. ఇటీవల నేను మెడ్ ప్లస్ నుంచి మెడిసిన్ కొనుగోలు చేశాను. బిల్ లో ‘లొకేషన్ సర్ చార్జి ఫీ’ అని కొత్తగా గమనించాను. ఈ చార్జ్ ఎందుకు వసూలు చేస్తున్నారు? ఆర్డర్ చేసే సమయంలో ఎక్కడా ముందుగా పేర్కొనలేదు. దీనిపై స్పష్టత ఇవ్వండి అని మెడ్ ప్లస్ ఎక్స్ ఖాతాకు ట్యాగ్ చేస్తూ పోస్టు చేశారు. ఈ ట్వీట్ కు స్పందించిన మెడ్ ప్లస్.. దయచేసి మీ కాంటాక్ట్ నంబర్ ను మాకు పంపించండి మా ఎగ్జిక్యూటివ్ త్వరలోనే మిమ్మల్ని సంప్రదిస్తారు అని మాత్రమే రిప్లయ్ ఇచ్చింది. ఈ వివాదంపై మాత్రం ఎలాంటి వివరణ ఇవ్వలేదు. కాగా మెడ్ ప్లస్ లొకేషన్ సర్ జార్జీలపై గత ఆగస్టు నుంచే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు కనిపిస్తున్నాయి. అయినా మెడ్ ప్లస్ నుంచి తమకు ఎలాంటి సమాధానం రావడం లేదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.































