తక్కువ ధరకే ఏ వస్తువైనా కొనుగోలు చేయాలి… అది కూడా బ్రాండెడ్ వస్తువు అయితే మరీ మంచిది. ఇలాగే ఉంటుందని మధ్యతరగతి జీవుల ఆలోచన.
అందుకనే హైదరాబాద్‌లో ఉండే మిడిల్ క్లాస్ మ్యాగ్జిమమ్..బేగంబజార్‌లో ఇంటికి కావాల్సిన సామానులు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్నేళ్ల నుంచి ఇక్కడ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఇక్కడ హోల్‌సేల్ రేట్లకు రిటైల్‌గా వస్తువులు దొరుకుతాయని జనం నమ్ముతున్నారు. కానీ సరిగ్గా దీన్నే ఆసరాగా చేసుకుని మోసం చేస్తున్నారు బేగంబజార్ కేటుగాళ్లు. అసలు బేగంబజార్‌లో ఏం జరుగుతోంది?
బేగంబజార్‌లో బ్రాండెడ్ వస్తువులు చాలా చీప్‌గా వస్తాయనేది హైదరాబాద్‌లో ఉంటున్న వారికి చాలా నమ్మకం. ఈ నమ్మకంతోనే చాలా మంది కిచెన్ వస్తువులతోపాటు ఇంటికి సంబంధించిన వస్తువులు, గృహోపకరణాలు కొనేందుకు బేగంబజార్‌లోని షాపులన్నీ జల్లెడ పడుతుంటారు. అసలే తక్కువ ధరలో లభిస్తాయనే నమ్మకం ఉన్నా.. ఇంకా తక్కువ ధర ఉన్న వస్తువుల కోసం బేగంబజార్‌లోని వీధులన్నీ తిరుగుతుంటారు. కానీ అలా తిరిగే వారు.. మీ కాళ్లకు ఓసారి బ్రేకేయండి. అఫ్‌కోర్స్ ఇప్పుడు మేం చెప్పే విషయం వింటే.. మీ కాళ్లకు ఆటోమేటిగ్గా బ్రేకులు పడిపోతాయనుకోండి. యస్.. మీరు విన్నది కరెక్టే… ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. బేగంబజార్‌లో దొరికే వస్తువులు చాలా వరకు నకిలీవేనని తేలింది. అచ్చం బ్రాండెడ్ వస్తువులను పోలి ఉంటాయి. కానీ అవి నిజంగా బ్రాండెడ్‌వే అనుకుంటే పొరపాటే అంటున్నారు పోలీసులు. బేగంబజార్‌లో బ్రాండెడ్ వస్తువులను పోలిన నకిలీ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారని ఇంటర్నేషనల్ కార్పొరేట్ విజిలెన్స్ ఏజెన్సీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. వారి తనిఖీల్లో కళ్లు చెదిరే వాస్తవాలు వెలుగు చూశాయి. సెల్‌ఫోన్ దగ్గర్నుంచి ఇయర్ బడ్స్ వరకు… కిచెన్ సామాగ్రి దగ్గర నుంచి ఇంటీరియర్ వరకు అంతా నకిలీయేనని గుర్తించారు. ప్రముఖ కంపెనీకి సంబంధించిన కిచెన్ వస్తువులు, కూలర్స్, వాషింగ్ మెషీన్స్ అన్నీ నకిలీ వాటిని అమ్ముతున్నట్లు గుర్తించారు.
ఇక ఈ వస్తువులను చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. అచ్చం ఆ వస్తువులన్నీ ఒరిజినల్ ప్రొడక్ట్స్ లాగే ఉన్నాయి. ప్రముఖ కంపెనీలు తమ బ్రాండ్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటే.. ఈజీగా వాటిని కాపీ కొట్టి కుటీర పరిశ్రమల్లో వీటిని తయారు చేసి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో భాగంగా బేగంబజార్ లోని పీల్ ఖానా కాంప్లెక్స్‌లో RJ ఎంపీక్స్ షాప్ నిర్వహిస్తున్న కిరణ్, బల్‌సింగ్ షాపులో నకిలీ ఉత్పత్తులు పట్టుబడ్డాయి. అటు మహరాజ్ గంజ్‌లోని ఓ గోదాంపై రైడ్ చేశారు. నకిలీ వెట్ గ్రైండర్స్, ఎల్పీజీ స్టౌవ్‌లు సీజ్ చేశారు. వాటి విలువ లక్షల్లో ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఇక చాలా మంది బేగంబజార్‌లో బ్రాండెడ్ వస్తువులు కొనుగోలు చేయాలనుకునే వారు కాస్తా ఆలోచించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సో బీ అలర్ట్.. బజార్‌లో ఇలాంటి నకిలీలు పొంచి ఉన్నారు జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇస్తున్నారు.
































