చిన్న చిన్న విషయాలూ మర్చిపోతున్నారా?

చిన్నచిన్న విషయాలు వెంటనే గుర్తుకు రాకపోవడం సాధారణమే. కొన్నిసార్లు వస్తువుల పేర్లు, వ్యక్తుల పేర్లు, ప్రాంతాల పేర్లు గుర్తుకు రాకపోవడం జరుగుతుంటుంది.


దుకాణానికి వెళ్లి ఏమి కొనాలో మర్చిపోవడం కూడా సాధారణమే. దీనికి వయస్సుతో సంబంధం లేదు. అన్ని వయసుల వారికీ ఇలాంటివి జరగవచ్చు. అయితే, ఇలా చిన్న విషయాలనూ మర్చిపోవడం డిమెన్షియా లేదా అల్జీమర్స్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రారంభ లక్షణాలా? అనే భయం చాలా మందిలో ఉంటుంది.

మతిమరుపుకు సాధారణ కారణాలు

  • కొన్నిసార్లు నిద్ర సరిగా లేకపోవడం, ఎక్కువగా అలసిపోవడం, మద్యం సేవించడం వల్ల కూడా మతిమరుపు వస్తుంది. అతిగా భోజనం చేసిన తర్వాత మెదడు నుంచి జీర్ణక్రియకు రక్తప్రవాహం ఎక్కువగా వెళ్లడం వల్ల తాత్కాలికంగా మరిచిపోవడం జరుగుతుంటుంది.
  • అలెర్జీ మందులు, దగ్గు మందులు, కండరాల సడలింపు మందులు, నొప్పి నివారణ మందులు ఇలా కొన్ని మందులు కూడా మతిమరుపుకు కారణమవుతాయి.
  • ఇంకో ముఖ్య కారణం హార్మోన్ల మార్పులు. థైరాయిడ్ హార్మోన్లు మెదడు సరిగ్గా పనిచేయడానికి చాలా అవసరం. ఇవి తక్కువగా ఉంటే మతిమరుపు, అలసట, బరువు పెరగడం, చర్మం పొడిబారడం, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి.
  • మహిళల్లో గర్భధారణ సమయంలో, నెలసరి సమయంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్లలో మార్పులు వస్తాయి. అప్పుడు కొన్ని నెలలు మతిమరుపు ఉండొచ్చు. ఇది తాత్కాలిక సమస్యేనని, భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.
  • భయం, ఒత్తిడి, తలకు గాయాలు, తీవ్రమైన మానసిక ఒత్తిడి, అనారోగ్యాలు కూడా మతిమరుపునకు కారణమవుతాయి. ఇలాంటి సందర్భాల్లో ముందుగా భయపడకుండా, రక్త పరీక్షలు చేయించుకోవడం మంచిది. ముఖ్యంగా ఐరన్, థైరాయిడ్, విటమిన్ B12 పరీక్షలు అవసరం. లక్షణాలు ఎక్కువగా ఉంటే CT స్కాన్, MRI కూడా చేయించుకోవాలి.

డిమెన్షియా హెచ్చరిక లక్షణాలు

డిమెన్షియా ఉన్నవారిలో మతిమరుపు తీవ్రంగా ఉంటుంది. ఇటీవల జరిగిన విషయాలు కూడా గుర్తుండవు. భవిష్యత్తు ప్రణాళికలు వేయలేరు. సులభమైన పనులూ చేయడం కష్టంగా అనిపిస్తుంది. తేదీలు, రోజులు గందరగోళంగా అనిపిస్తాయి. మాట్లాడటంలో ఇబ్బంది, చిరాకు, కోపం, ఒంటరిగా ఉండాలనుకోవడం కనిపిస్తాయి. ఇవన్నీ కుటుంబసభ్యులు గమనించగలుగుతారు. ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వీటిల్లో కొన్ని సమస్యలు చికిత్సతో నయం చేయవచ్చు.

మతిమరుపు రాకుండా ఉండేందుకు చేయాల్సినవి

  • షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుకోండి
  • రోజూ పండ్లు, కూరగాయలు తినండి
  • విటమిన్ D, కాల్షియం లోపం లేకుండా చూసుకోండి
  • విటమిన్ B12, ఇతర B విటమిన్లు కూడా అవసరం
  • ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు తీసుకోవడం మంచిది
  • రోజుకు కనీసం 40 నిమిషాలు నడవడం లేదా వ్యాయామం చేయండి
  • పుస్తకాలు చదవండి, పజిల్స్ పరిష్కరించండి, కొత్త విషయాలు నేర్చుకోండి
  • రోజుకు 7-8 గంటలు నిద్రపోండి
  • ఒత్తిడిని తగ్గించుకోండి, ధ్యానం, ప్రాణాయామం చేయండి.

(Note:ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతుంది. కేవలం మీ అవగాహన కోసమే)

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.