ఇటీవల కాలంలో చాలా మంది చిన్న వయసులోనే జుట్టు తెల్లబడడంతో కచ్చితంగా జుట్టును కలర్ చేస్తున్నారు. హెయిర్ కలరింగ్ ఇప్పుడు సర్వసాధారణ ప్రక్రియగా మారిపోయింది.
ఒకప్పుడు వృద్ధాప్యం వచ్చిన తర్వాత జుట్టు తెల్లబడిన వారు మాత్రమే వేసుకునే రంగు, ఇప్పుడు ఏ వయసులో ఉన్న వారైనా వేసుకోవలసి వస్తుంది. అయితే జుట్టుకు రంగు వేసుకునే వారు కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు.
జుట్టుకు రంగు వేస్తే వచ్చే సమస్యలివే
అయితే జుట్టుకు తరచూ రంగు వేసుకోవడం వల్ల వచ్చే ఇబ్బందులు ఏమిటి? అసలు ఎటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. జుట్టుకు రంగు వేయడం వల్ల చాలా రకాల ఇబ్బందులు వస్తాయి. రంగుల్లో ఉండే రసాయనాలు జుట్టులో ఉండే తేమని తీసివేసి వాటిని పొడిగా చేస్తాయి. ఫలితంగా జుట్టు చిట్లి పోయి రాలిపోతుంది. జుట్టుకు రంగు వేయడం వల్ల తలలో చుండ్రు సమస్య ఎక్కువ అవుతుంది.
క్యాన్సర్ ముప్పు కూడా
జుట్టు రంగులలో ఉండే పదార్థాలు కొంతమందికి అస్సలు పడవు. వీటివల్ల అలర్జీలను ఎదుర్కోవాల్సి వస్తుంది. తరచుగా జుట్టుకు రంగు వేయడం వల్ల హెయిర్ ఫాలికల్స్ దెబ్బతింటాయి. ఫలితంగా జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. కొన్ని అధ్యయనాలు ప్రకారం జుట్టు రంగులో ఉండే రసాయనాలు మనలో క్యాన్సర్ కు కారణంగా కూడా మారుతాయి.
జుట్టుకు రంగు వేస్తే ఈ అనారోగ్య సమస్యలు వచ్చే చాన్స్
జుట్టుకు రంగు వేసేటప్పుడు వెలువడే వాయువులను పీల్చడం వల్ల శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాదు రంగు వేసిన జుట్టు త్వరగా జీవాన్ని కోల్పోతుంది. సూర్య రశ్మి, క్లోరిన్ నీరు వంటి వాటికి ఎక్కువగా గురి కావడం వల్ల రంగు వేసిన జుట్టు త్వరగా రంగులు కోల్పోయి మళ్ళీ రంగు వేసుకునే పరిస్థితి వస్తుంది. ఇక గర్భిణీ స్త్రీలు జుట్టుకు రంగు వేసుకోవడం అస్సలు మంచిది కాదు. ఇది గర్భంలోని శిశువుకు కూడా హాని కలిగించే అవకాశం ఉంటుంది.
జుట్టుకు రంగు విషయంలో జాగ్రత్త
అంతేకాదు జుట్టుకు రంగు వేయించుకోవడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. జుట్టుకు వేసుకున్న రంగు నిలబడాలంటే తరచూ సెలూన్ కు వెళ్లాల్సి ఉంటుంది. ఇది మన ఆర్థిక పరిస్థితి పైన కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. కనుక జుట్టుకు రంగు వేసుకునేవారు ఇన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే జుట్టు ఆరోగ్యం విషయంలో మొదటి నుంచి జాగ్రత్తగా ఉండాలి.
జుట్టుకు పోషకాలతో తెల్లబడే సమస్య దూరం
మన జుట్టుకు కావలసిన పోషకాలను అందిస్తే అవి త్వరితగతిన తెల్లబడకుండా ఉంటాయి. కాబట్టి జుట్టుకు రంగు వేసుకునే ముందు జుట్టు ఆరోగ్యం గురించి తెలుసుకోవాలి. జుట్టుకు కావలసిన పోషకాలను అందించాలని మరిచిపోకుండా ఉంటే చిన్న వయసులోనే రంగు వేయాల్సిన అవసరమే రాకుండా ఉంటుంది.