ఏపీలో సంక్రాంతి జరుపుకునేందుకు వచ్చిన హైదరాబాద్ అతిథులంతా తిరుగుముఖం పడుతున్నారు. దీంతో తిరిగి టోల్ ప్లాజాల దగ్గర సంక్రాంతి పండుగ ముందు రద్దీ కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో సంక్రాంతి ప్రయాణికుల వాహనాలు టోల్ ప్లాజాల వద్ద రద్దీలో చిక్కుకుని ఇబ్బందులు పడకుండా రెండు రాష్ట్రాల అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా గుంటూరు, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు టోల్ ప్లాజాలు టచ్ కాకుండా దారి మళ్లింపులు చేస్తున్నారు.
హైదరాబాద్ హైవేపై జాతీయ రహదారి 65 విస్తరణ పనులు జరుగుతున్నాయి. అదే సమయంలో సంక్రాంతి ప్రయాణికుల రద్దీ కూడా పెరుగుతోంది. దీంతో చిట్యాల, పెద్ద కాపర్తి, కొర్లపహాడ్, పంతంగి టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్ లో చిక్కుకోకుండా పోలీసులు పలు ప్రత్యామ్నాయ మార్గాల్ని సూచిస్తున్నారు. ఈ మార్గాల్లో వెళ్లడం ద్వారా టోల్ ప్లాజా ఫీజులతో పాటు ట్రాఫిక్ జామ్ లను కూడా తప్పించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఏపీ నుంచి వచ్చే ప్రయాణికులు వీటిని గమనించాల్సి ఉంటుంది.
ముఖ్యంగా విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే ప్రయాణికులు లేదా భారీ వాహనాలు కోదాడ-మాల్ మీదుగా హైదరాబాద్ కు మళ్లిస్తున్నారు. అలాగే చిట్యాల నుంచి భువనగిరి మీదుగా కూడా హైదరాబాద్ వెళ్లొచ్చు. అలాగే గుంటూరు నుంచి వచ్చే వాహనాలు మిర్యాలగూడ, హాలియా-చింతపల్లి-మాల్ మీదుగా హైదరాబాద్ కు చేరుకునే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో పాటు మాచర్ల, సాగర్, పెద్దవూర, చింతపల్లి, మాల్ మీదుగా వాహనాలు హైదరాబాద్ చేరుకోవచ్చు. అయితే టోల్ ప్లాజాల వద్ద రద్దీ లేకపోతే మాత్రం సాధారణ మార్గాల్లోనే వాహనాలను పంపుతున్నారు.



































