Lifestyle: ఉదయం ఆలస్యంగా టిఫిన్ చేస్తున్నారా.? ఈ సమస్య తప్పదు..

www.mannamweb.com


ఉదయం టిఫిన్‌ చేయడం ఎంతో ముఖ్యమని చెబుతుంటారు. రాత్రంతా ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉంటాం కాబట్టి ఉదయం వీలైనంత త్వరగా టిఫిన్‌ చేయాలని సూచిస్తుంటారు. అయితే ఉదయం టిఫిన్‌ చేయడం ఎంత ముఖ్యమో, ఏ సమయంలో చేస్తున్నామనేది కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఆలస్యంగా టిఫిన్‌ చేసే వారిలో మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.

ఇదేదో ఆషామాషిగా చెబుతోన్న విషయం కాదు. పలువురిపై పరిశోధనలు చేసిన తర్వాత నిర్ధారణకు వచ్చారు. ఉదయం 8 గంటల్లోపే టిఫిన్‌ చేసిన వారికి, 9 గంటల తర్వాత తిన్న వారితో పోలిస్తే మధుమేహం వచ్చే అవకాశాలు 59 శాతం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. టైప్‌ 2 డయాబెటిస్‌ రావడానికి అనారోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ తగ్గడం, స్మోకింగ్ వంటివి మాత్రమే కారణమని మనకు ఇప్పటి వరకు తెలుసు. అయితే ఆలస్యంగా టిఫిన్‌ చేయడం కూడా ఇందుకు కారణమని నిపుణులు అంటున్నారు.

ఆహారాన్ని తీసుకునే సమయం రక్తంలో గ్లూకోజు, కొలెస్ట్రాల్‌ మోతాదుల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆహారం తీసుకునే సమయాల మధ్య గ్యాప్‌ టైప్‌2 డయాబెటిస్‌ మధ్య సంబంధాన్ని గుర్తించేందుకు గాను ఐఎస్‌గ్లోబల్‌ నిపుణులు పరిశోధన చేపట్టారు. ఇందులో భాగంగా 1,03,312 మందిని పరిగణలోకి తీసుకొని వారి ఆహార అలవాట్లను విశ్లేషించారు. దాదాపు ఏడేళ్లకు పైగా వారి ఆరోగ్య పరిస్థితులను పరిశీలించారు.

వీరిలో ఆలస్యంగా టిఫిన్‌ తీసుకున్న వారిలో మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. రోజూ ఉదయం 9 గంటల తర్వాత టిఫిన్‌ తీసుకున్న వారిలో డయాబెటిస్ ముప్పు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అంతేకాదు రాత్రి ఆలస్యంగా భోజనం చేసే వారికి కూడా మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఒకేసారి ఎక్కువ మోతాదులో కాకుండా కొంచెం కొంచెం ఎక్కువ సార్లు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.