మీ స్మార్ట్‌ఫోన్ కవర్‌లో నోట్స్, ఏటీఎం కార్డ్స్‌ ఉంచుతున్నారా? జాగ్రత్త

వెనుక కవర్‌లో కార్డ్ లేదా నోట్ ఉంచుకోవడం వల్ల ఫోన్ యాంటెన్నాపై కూడా ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. ఇది సిగ్నల్‌ను బలహీనపరుస్తుంది. కాల్ డ్రాప్‌లకు లేదా ఇంటర్నెట్ నెమ్మదించడానికి దారితీస్తుంది. అలాగే మీ ఫోన్‌లో సిగ్నల్స్‌ సరిగ్గా ఉండకపోవడం వంటి..


డిజిటల్ ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్ ప్రజల జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. ఇప్పుడు ప్రజలు తమ స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించడం పెరిగిపోయింది. కానీ కొంతమంది తమ స్మార్ట్‌ఫోన్ కవర్‌లో నోట్లు లేదా ATM కార్డ్ లేదా మెట్రో కార్డును ఉంచుకోవడం అలవాటుగా మార్చుకుంటున్నారు. కానీ వేసవి కాలంలో ఇలా చేయడం మీకు ప్రమాదకరమని టెక్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేసవిలో స్మార్ట్‌ఫోన్ కవర్‌లో నోట్లు లేదా ATM కార్డులను ఎందుకు ఉంచకూడదో తెలుసుకుందాం.

వేసవి కాలంలో ఎలక్ట్రానిక్ పరికరాలు వేడెక్కడం, పేలడం అనే వార్తలు సర్వసాధారణం అయ్యాయి. ప్రజలు పరికరాన్ని చాలా నిర్లక్ష్యంగా ఉపయోగించడం వల్ల ఇది జరుగుతుంది. చాలా మంది ఫోన్ కవర్‌లో డబ్బు, కార్డులు లేదా ఇతర వస్తువులను ఉంచుకుంటారు కానీ ఈ అలవాటు మీ ఫోన్‌కు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తున్నప్పుడు వేడెక్కుతుంది. వెనుక కవర్‌లో నోట్ లేదా కార్డులు, ఇతర చిటీలు ఉంచడం వల్ల వేడి సరిగ్గా బయటకు వెళ్లదు. దీని వలన వేడెక్కడం వల్ల ఫోన్‌ పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుందంటున్నారు.

ఇది కాకుండా, ఫోన్‌లో గేమింగ్ లేదా వీడియో స్ట్రీమింగ్ వంటి భారీ ప్రాసెసింగ్ చేసినప్పుడు ఫోన్‌ నుండి ఎక్కువ వేడి ఉత్పత్తి అవుతుంది. వెనుక కవర్‌లో ఉంచిన వస్తువులు ఫోన్‌ను చల్లబరచడంలో అడ్డంకులను సృష్టిస్తాయి. ఇది ఫోన్ పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది.

వెనుక కవర్‌లో కార్డ్ లేదా నోట్ ఉంచుకోవడం వల్ల ఫోన్ యాంటెన్నాపై కూడా ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. ఇది సిగ్నల్‌ను బలహీనపరుస్తుంది. కాల్ డ్రాప్‌లకు లేదా ఇంటర్నెట్ నెమ్మదించడానికి దారితీస్తుంది. అలాగే మీ ఫోన్‌లో సిగ్నల్స్‌ సరిగ్గా ఉండకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

అధిక వేడి ఫోన్ బ్యాటరీపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. దీని వలన బ్యాటరీ త్వరగా పాడైపోతుంది. దీంతో పేలిపోయే ప్రమాదం ఉండవచ్చు. అందుకే ముఖ్యంగా వేసవి కాలంలో నోట్లు, ఏటీఎం కార్డులు లేదా మరే ఇతర వస్తువులను స్మార్ట్‌ఫోన్ కవర్‌లో ఉంచకూడదంటున్నారు నిపుణులు.

ఈ సమస్యను నివారించడానికి ఫోన్ కవర్‌లో ఎలాంటి కాగితం, నోట్ లేదా కార్డు ఉంచవద్దు. ముఖ్యంగా వేసవిలో ఫోన్‌ను చల్లని, గాలి వచ్చే ప్రదేశంలో ఉంచండి. ఫోన్ చాలా వేడెక్కుతుంటే కొంత సమయం వరకు వాడటం మానేయండి. స్మార్ట్‌ఫోన్‌ను ప్రత్యక్ష సూర్యకాంతిలో లేదా అధిక వేడి ఉన్న ప్రదేశాలలో ఉంచవద్దని గుర్తించుకోండి.