మిగిలిపోయిన అన్నాన్ని మళ్ళీ వేడి చేసుకుని తినడం మన ఇళ్లల్లో సర్వసాధారణం. అయితే, అన్నం నిల్వ చేసే విధానంలోనూ, వేడి చేసే పద్ధతిలోనూ చేసే చిన్న పొరపాటు తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చాలామంది ఇళ్లల్లో రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని మరుసటి రోజు వేడి చేసుకుని తింటుంటారు. చూడటానికి బాగనే ఉంది, ఇంకా ఎలాంటి వాసన రావడం లేదు కదా అని మనం ఏమాత్రం ఆలోచించకుండా తినేస్తాం. కానీ, సరిగ్గా నిల్వ చేయని అన్నం ప్రమాదకరమైన బ్యాక్టీరియాకు నిలయంగా మారుతుందని మీకు తెలుసా? దీనివల్ల ప్రాణాంతకమైన కడుపు ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అమీ షా హెచ్చరిస్తున్నారు.
ఫ్రిజ్‌లో పెట్టిన అన్నం ఆరోగ్యానికి మంచిదేనా?
సాధారణంగా ఫ్రిజ్‌లో పెట్టిన అన్నం తింటే ఆరోగ్యానికి కీడు జరుగుతుందని చాలామంది భయపడతారు. కానీ డాక్టర్ అమీ షా దీనిపై ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. “అన్నం వండిన తర్వాత దాన్ని త్వరగా చల్లార్చి, రాత్రంతా ఫ్రిజ్‌లో భద్రపరిస్తే అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇలా చేయడం వల్ల అన్నంలోని పిండి పదార్థం (Starch), ‘రెసిస్టెంట్ స్టార్చ్’గా మారుతుంది. ఇది మీ రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడమే కాకుండా, పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా ఉపయోగపడుతుంది” అని ఆమె వివరించారు.
అసలైన ముప్పు ఎక్కడ ఉంది?
నిజానికి సమస్య అన్నం ఫ్రిజ్‌లో పెట్టడంలో లేదు.. పెట్టకముందు మనం చేసే పనిలోనే ఉంది. చాలామంది అన్నం వండిన తర్వాత గంటల తరబడి దాన్ని బయటే వదిలేస్తారు. ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు లేదా బ్యాచిలర్స్ వండిన గిన్నెను అలానే స్టవ్ మీదో, టేబుల్ మీదో వదిలేస్తుంటారు.
“అన్నాన్ని గది ఉష్ణోగ్రత వద్ద గంటల తరబడి బయట ఉంచడం మీరు చేసే అతిపెద్ద తప్పు. దీనివల్ల అన్నంలో ‘బాసిల్లస్ సిరియస్’ (Bacillus cereus) అనే ప్రమాదకరమైన బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది. ఇది తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇది ప్రాణాపాయ స్థితికి చేర్చి, ఆసుపత్రి పాలు కూడా చేయవచ్చు” అని డాక్టర్ అమీ షా హెచ్చరించారు.
సురక్షితంగా ఉండాలంటే ఏం చేయాలి?
మెడికల్ స్కూల్‌లో చదువుకునే రోజుల్లోనే ఆహార భద్రతపై అడిగే ప్రాథమిక ప్రశ్నల్లో ఇది ఒకటి అని ఆమె గుర్తు చేశారు. అన్నం విషయంలో మీరు పాటించాల్సిన మూడు ముఖ్యమైన సూత్రాలు ఇవే:
త్వరగా చల్లార్చండి: అన్నం వండిన వెంటనే దాన్ని గాలి తగిలేలా చేసి వేగంగా చల్లబరచాలి.
గాలి చొరబడని డబ్బా: చల్లారిన అన్నాన్ని గాలి చొరబడని కంటైనర్‌లో పెట్టి వెంటనే ఫ్రిజ్‌లో భద్రపరచాలి.
ఒక్కసారే వేడి చేయాలి: ఫ్రిజ్‌లో ఉన్న అన్నాన్ని తీసి ఒక్కసారి మాత్రమే వేడి చేయాలి. పదే పదే వేడి చేయడం అస్సలు మంచిది కాదు.
చూడటానికి సాధారణంగా అనిపించినా, మనం తీసుకునే ఈ చిన్న జాగ్రత్తలు మన జీర్ణవ్యవస్థను, ఆరోగ్యాన్ని కాపాడతాయి. కాబట్టి, ఇకపై మిగిలిన అన్నం విషయంలో అప్రమత్తంగా ఉండండి.
(గమనిక: ఈ సమాచారం సోషల్ మీడియాలో నిపుణులు పంచుకున్న వివరాల ఆధారంగా రూపొందింది. ఇది వైద్య సలహాలకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా సందేహాలు ఉన్నవారు తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి.)


































