మారిన లైఫ్ స్టైయిల్,ఆహార అలవాట్లలో మార్పులు వంటి అనేక రకాల కారణాల వల్ల ఈ రోజుల్లో చాలామంది మొటిమల సమస్యను ఎదుర్కొంటన్నారు. ఈ మొటిమల కారణంగా పార్టీకి వెళ్లాలన్నా, నలుగురిలోకి వెళ్లాలన్నా అసౌకర్యంగా అనిపిస్తుంటది.
ముఖ్యంగా చాలామంది మహిళలు యుక్త వయస్సులో హార్మోన్ల మార్పుల వల్ల మొటిమల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. నుదిటిపై మొటిమలను పొగొట్టేందుకు ఖరీదైన ప్రొడక్ట్స్ లను వాడినా కొందరిలో ఫలితం కనిపించదు. ఈ మొటిమలు కేవలం అందాన్ని తగ్గించడమే కాదు, కొన్నిసార్లు నొప్పితో కూడా వేధిస్తాయి. అసలు ఈ మొటిమలు నుదుటిపైనే ఎందుకు ఎక్కువగా వస్తాయి? వాటిని సహజంగా, ఇంట్లోనే ఎలా తగ్గించుకోవాలి అనేది ఇక్కడ చూడండి.
నుదుటిపై మొటిమలు రావడానికి ప్రధాన కారణాలు
జిడ్డు చర్మం: నుదుటి భాగంలో చర్మ గ్రంథులు ఆయిల్ ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. ఈ నూనె దుమ్ము, ధూళితో కలిసి చర్మ రంధ్రాలను మూసివేసి మొటిమలకు దారితీస్తుంది.
చుండ్రు: తలలోని చుండ్రు నుదుటిపై పడటం వల్ల కూడా ఇన్ఫెక్షన్ వచ్చి మొటిమలు ఏర్పడతాయి.
హార్మోన్ల అసమతుల్యత: యుక్తవయసు, స్త్రీలలో పీరియడ్స్ సమయంలో హార్మోన్ల స్థాయిలలో మార్పులు రావడం మొటిమలకు ముఖ్య కారణం.
జీవనశైలి: సరైన నిద్ర లేకపోవడం, అధిక ఒత్తిడి, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వంటివి కూడా మొటిమలు రావడానికి ఒక కారణం.
సౌందర్య ఉత్పత్తులు: రోజూ మేకప్ వేసుకోవడం, రాత్రికి దాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, జుట్టుకు వాడే నూనెలు, క్రీములు నుదుటికి అంటుకోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది.
మొటిమలను తరిమికొట్టే అద్భుతమైన ఇంటి చిట్కాలు
స్క్రబ్బింగ్ వద్దు
నుదుటిపై మొటిమలు ఉన్నప్పుడు గట్టిగా రుద్దడం లేదా స్క్రబ్ చేయడం అస్సలు చేయకూడదు. ఇది చర్మాన్ని మరింత చికాకుపరిచి, సమస్యను పెద్దది చేస్తుంది. మురికి చేతులతో ముఖాన్ని తాకవద్దు. అలాగే, వారానికి కనీసం మూడుసార్లు తలస్నానం చేసి, జుట్టును శుభ్రంగా ఉంచుకోండి.
నిమ్మరసం – సహజ బ్లీచ్
నిమ్మరసంలోని యాంటీ-బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. కొన్ని చుక్కల నిమ్మరసాన్ని నీటితో కలిపి, దూది సహాయంతో మొటిమలపై రాయండి. 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయండి.
కలబంద
కలబంద గుజ్జు చర్మానికి చలువ చేసి, మంటను తగ్గిస్తుంది. స్వచ్ఛమైన కలబంద గుజ్జును నేరుగా నుదుటిపై రాసి, ఆరిన తర్వాత కడిగేయండి. ఇది మొటిమలనే కాదు, వాటి వల్ల ఏర్పడే మచ్చలను కూడా తగ్గిస్తుంది.
శనగపిండి, బాదం ప్యాక్
ఒక చెంచా శనగపిండి, ఒక చెంచా బాదం పొడిలో చిటికెడు పసుపు, కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్ లా చేసుకోండి. ఈ ప్యాక్‌ను నుదుటిపై 15 నిమిషాల పాటు ఉంచి, ఆ తర్వాత కడిగేయండి. ఇది మొటిమలను తగ్గించి, చర్మానికి మంచి నిగారింపును ఇస్తుంది.
టీ ట్రీ ఆయిల్ – మొటిమల శత్రువు
టీ ట్రీ ఆయిల్‌లో శక్తివంతమైన యాంటీ-మైక్రోబయల్ గుణాలు ఉన్నాయి. రెండు చుక్కల టీ ట్రీ ఆయిల్‌ను ఒక చెంచా కొబ్బరి నూనెలో గానీ, నీటిలో గానీ కలిపి మొటిమలపై రాయండి. రాత్రంతా ఉంచుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
ఐస్ క్యూబ్స్ – తక్షణ ఉపశమనం
మొటిమల వల్ల వచ్చే నొప్పి, వాపు, ఎరుపుదనాన్ని తగ్గించడానికి ఐస్ క్యూబ్స్ అద్భుతంగా పనిచేస్తాయి. ఒక ఐస్ క్యూబ్ ను శుభ్రమైన గుడ్డలో చుట్టి, మొటిమలపై సున్నితంగా కొన్ని సెకన్ల పాటు ఉంచండి.
దోసకాయ రసం
దోసకాయ రసం చర్మాన్ని శుభ్రపరిచి, చల్లబరుస్తుంది. దోసకాయ రసాన్ని దూదితో నుదుటిపై రాసి, ఆరిన తర్వాత కడిగేయండి. ఇలా రోజూ చేయడం వల్ల మొటిమలు క్రమంగా తగ్గుముఖం పడతాయి.































