చాలా చిన్నగా అనిపించే గసగసాలు వంటకాల రుచిని పెంచుతాయి. అంతే కాదు, అవి కొన్ని వ్యాధుల నుండి దూరంగా ఉండటానికి కూడా సహాయపడతాయి. గుండె, జీర్ణ వ్యవస్థ, చర్మం, జుట్టు, డయాబెటీస్, ఎముకలు, నరాల సమస్యలను తగ్గించడంలో గసగసాలు ఎంతో ప్రభావవంతంగా పని చేస్తాయి. గసగసాలు తినడం వల్ల కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం…
గసగసాలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గసగసాల్లో క్యాల్షియం, మాంగనీస్, ఫాస్పరస్, జింక్, ఐరన్, మెగ్నీషియం, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి శరీరాన్ని వ్యాధుల నుండి రక్షిస్తాయి. పంటి నొప్పితో బాధపడేవారికి గసగసాలు అద్భుతమైన ఔషధంగా పనిచేస్తాయి.
అధిక దాహంతో బాధపడేవారికి గసగసాలు ప్రయోజనకరంగా ఉంటాయి. రాత్రి పడుకునే ముందు గసగసాల పేస్ట్ తయారు చేసి పాలతో కలిపి తీసుకోవడం వల్ల నిద్రలేమి నుండి ఉపశమనం పొందవచ్చు. నిద్రకు సంబంధించిన సమస్యలన్నీ కంట్రోల్ అవుతాయి. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో కూడా గసగసాలు చక్కగా పని చేస్తాయి. గుండెకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి.
గసగసాలు మూత్రపిండాల నుండి కాల్షియంను తగ్గించి, మూత్రపిండాల్లో రాళ్లను విచ్ఛిన్నం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. మూత్రపిండాల్లో రాళ్లు పదే పదే ఏర్పడకుండా నిరోధిస్తాయి. గసగసాలలో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. గసగసాలను రోజూ తినడం వల్ల మలబద్ధకం నుండి ఉపశమనం లభిస్తుంది.
గసగసాలు తినడం వల్ల అందాన్ని కూడా పెంచుకోవచ్చు. ఇందులో ఉండే పోషకాలు చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండేలా హెల్ప్ చేస్తాయి. తరచూ చర్మ, జుట్టు సమస్యలతో బాధపడేవారు గసగసాలను తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. గసగసాల్లో ఖనిజాలు, క్యాల్షియం పుష్కలంగా లభిస్తాయి. వీటిని తినడం వల్ల ఎముకలు, కండరాలు బలంగా ఆరోగ్యంగా ఉంటాయి. ఎముకలకు సంబంధించిన సమస్యలు తలెత్తవు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)
































