నేటి బిజీ లైఫ్లో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం పెద్ద గగనం అయిపోతుంది. ఆరోగ్యాన్ని గ్రాంటెండ్గా తీసుకునే రోజుల్లో ఉన్నాం.
ముఖ్యంగా ఆఫీసుల్లో గంటల తరబడి కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ ముందు కూర్చుని పని చేస్తూ.. నడుము నొప్పి, మెడనొప్పి వచ్చినా ఇగ్నోర్ చేసేస్తున్నాము. కానీ ఈ మిస్టేక్ చాలామందిలో కీళ్ల సమస్యలతో పాటు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకి దారి తీస్తుంది అంటున్నారు నిపుణులు. నిరంతరం కూర్చొని పని చేయడం వల్ల శారీరక అలసట మాత్రమే కాదు.. అనేక పెద్ద ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని చెప్తున్నారు.
వీటిని దృష్టిలో ఉంచుకుని.. శరీరాన్ని చురుకుగా ఉంచుకునేందుకు కొన్ని అలవాట్లను లైఫ్‌స్టైల్ రొటీన్లో చేర్చుకోవాలంటున్నారు. అలాంటి వాటిలో ఫిజియోథెరపీ ఒకటి. సులభమైన, సురక్షితమైన, ప్రభావవంతమైన మార్గంగా చెప్తున్నారు. దీనివల్ల గాయం లేదా నొప్పి నుంచి ఉపశమనం దొరకడమే కాకుండా.. భవిష్యత్తులో వచ్చే వ్యాధుల నుంచి రక్షణ ఉంటుంది. ఫిజియోథెరపీ అనేది కేవలం చికిత్స కాదని.. అది ఒక జీవనశైలి అంటున్నారు. మీరు ఎక్కువ కాలం ఆరోగ్యంగా, చురుకుగా ఉండేందుకు.. ఎలాంటి ఫిజియోథెరపీ చిట్కాలను ఫాలో అవ్వాలో చూసేద్దాం.
ఫిజియోథెరపీ ఎందుకు అవసరం?
ఫిజియోథెరపీ అనేది ఒక వైద్య విధానం. దీనిలో మందులకు బదులుగా వ్యాయామాలు, మసాజ్, స్ట్రెచింగ్, శరీర భంగిమలు ఉంటాయి. వీటితో నొప్పిని నయం చేస్తారు. ఎక్కువ కాలం ల్యాప్టాప్ ముందు కూర్చునే వారికి.. కంప్యూటర్ లేదా ల్యాప్టాప్లో వంగి పని చేసేవారికి, నిరంతరం మొబైల్ లేదా టాబ్లెట్లను ఉపయోగించేవారికి, వృద్ధులకు లేదా ఎముకలు, కండరాలు బలహీనంగా ఉన్నవారు.. గాయం, ఫ్రాక్చర్ లేదా శస్త్రచికిత్స నుంచి కోలుకుంటున్న వారు వీటిని ఫాలో అవ్వడం చాలా అవసరమని చెప్తున్నారు. ఫిజియో చేయడం వల్ల కండరాల బలం పెరుగుతుంది. ఎముకలు బలపడతాయి. మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. శస్త్రచికిత్స తర్వాత త్వరగా కోలుకోవచ్చు.
ఆఫీసులో పని చేసేవారికి ఫిజియోథెరపీ చిట్కాలు
- ప్రతి 30-40 నిమిషాలకు బ్రేక్ – ఎక్కువ కాలం కూర్చోవడం శరీరానికి హానికరం. అటువంటి పరిస్థితిలో.. ప్రతి అరగంటకు 2-3 నిమిషాల చిన్న విరామం తీసుకోండి. నిలబడండి. కొంచెం నడవండి లేదా స్ట్రెచ్ చేయండి.
- కూర్చునే విధానం – ఆఫీసులో పని చేయడానికి కూర్చున్నప్పుడు, మీ వీపును నిటారుగా ఉంచండి. భుజాలను వదులుగా, రిలాక్స్గా ఉంచండి. కాళ్లను నేలపై నేరుగా ఉంచండి. అలాగే మీ స్క్రీన్ మీ కళ్ల ముందు ఉండాలి. దీనివల్ల మెడ వంగదు.
- స్ట్రెచింగ్ చేయండి – పని మధ్యలో చేతులు, మెడ, వీపు, కాళ్లను కొద్దిగా స్ట్రెచ్ చేయండి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. బిగుసుకుపోవడాన్ని తగ్గిస్తుంది.
- తేలికపాటి వ్యాయామం – రోజును తేలికపాటి వ్యాయామం, యోగాతో ప్రారంభించండి. ఇది శరీరంలో ఫ్లెక్సీబులిటీని తెస్తుంది. రోజంతా చురుకుగా ఉండేలా చేస్తుంది.
- నిద్ర, విశ్రాంతి – శరీరం కోలుకోవడానికి 7-8 గంటల నిద్ర చాలా అవసరం. నిద్రపోయే ముందు మొబైల్ లేదా ల్యాప్టాప్ వాడకాన్ని తగ్గించండి.
వీటిని ఫాలో అవ్వడం వల్ల శరీరంపై అనవసరమైన ఒత్తిడి ఉండదు. నడుము నొప్పి, మెడ నొప్పి వంటి సమస్యలు రావు. అంతేకాకుండా మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. కాబట్టి డెస్క్ జాబ్ చేసేవారు వీటిని రెగ్యులర్‌గా ఫాలో అయితే మంచిది.




































