అరుణాచల గిరిప్రదక్షిణలో 44 ఎనర్జీ పాయింట్స్ – అవి ఏవి వాటి విశిష్టత ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Arunachalam Giri Pradakshina: శివం పంచభూతాత్మకం..పంచభూతాల స్వరూపుడైన శివుడు లింగరూపంలో వెలసిన 5 ప్రదేశాలే పంచభూతలింగాలు. వాటిలో ఒకటి అరుణాచలం.


ఇక్కడ విశిష్టత ఏంటంటే దేవుడు కొండపై కాదు కొండే దేవుడిగా వెలసిన క్షేత్రం ఇది. ఇక్కడ శంకరుడు అగ్నిలింగంగా కొలువయ్యాడు. అగ్నితత్వానికి నిదర్శనంగా అరుణాచలం కొండ ఎర్రగా కనిపిస్తుంది. ఈ క్షేత్రంలో గిరిప్రదిక్షిణ చేస్తే సాక్షాత్తూ పరమేశ్వరుడి చుట్టూ తిరిగినట్టే. అయితే ప్రదక్షిణ అంటే కొండచుట్టూ తిరిగేయడం కాదు…ఈ మార్గంలో చాలా ఆలయాలు, తీర్థాలు ఉన్నాయి. వాటిలో 44 ప్రధానమైన ప్రదేశాలున్నాయి. వీటినే 44 ఎనర్జీ పాయింట్లు అంటారు. ఇవన్నీ చూసుకుంటూ గిరిప్రదక్షిణ చేస్తే అద్భుతమైన ఫలితం పొందుతారు. 44 ఎనర్జీ పాయింట్లలో అష్టదిక్పాలకులు అధిపతులుగా 8 శివలింగాలు.. 8 నందులు ఉన్నాయి. ఇంతకీ అరుణాచలం గిరిప్రదక్షిణ ఎక్కడ ప్రారంభించాలి .. ఎలా సాగాలి… మార్గ మధ్యలో ఏం దర్శించుకోవాలి ఈ వివరాలన్నీఈ కథనంలో తెలుసుకుందాం…

ఆలయ ప్రధాన గోపురం రెండో ప్రాకారంలో బ్రహ్మతీర్థం నుంచి గిరిప్రదక్షిణ ప్రారంభించాలి…గోపురం కింద శక్తి గణపతిని దర్శించుకుని బ్రహ్మతీర్థంలో నీళ్లు తలపై చల్లుకుని…బ్రహ్మలింగానికి నమస్కరించాక ప్రదక్షిణ మొదలవుతుంది…

మొత్తం 44 ఎనర్జీ పాయింట్లు దాటుకుని గమ్యానికి చేరుకోవాలి… ఇవే అవి…

1. బ్రహ్మలింగం – గిరి ప్రదిక్షిణ ప్రారంభించాల్సిన ప్రదేశం ఇది…

2. ఇంద్ర లింగం – ఇంద్రుడు ప్రతిష్టించిన శివలింగం , దీనికి శుక్రుడు – సూర్యుడు అధిదేవతలు. ఈ లింగాన్ని దర్శించుకుంటే కెరీర్ కి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి..

3. అగ్నిలింగం – అగ్ని తీర్థం – అరుణగిరి చుట్టూ మొత్తం 8 శివలింగాలున్నాయి..వాటిలో ఏడు రోడ్డుకి ఎడమవైపు ఉంటే అగ్నిలింగం కుడివైపు ఉంటుంది. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే కష్టకాలంలో ప్రమాదాల నుంచి గట్టెక్కిస్తాడు

4. శేషాద్రి స్వామి – ఈయన కామాక్షి అమ్మవారి స్వరూపంతో జన్మించారని చెబుతారు. అవధూత స్వరూపంలో భక్తులను అనుగ్రహించేవారు.

5. దక్షిణా మూర్తి – ఇది చాలా పురాతనమైన, శక్తివంతమైన ఆలయం…దాదాపు 1500 ఏళ్ల క్రితం నుంచి ఈ ఆలయం ఉంది.

6. రమణాశ్రమం – ఇక్కడ రమణమహర్షి తల్లి సమాధి ఉంటుంది..దానికి నమస్కరించుకుని రమణాశ్రమంలో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి

7. మీనాక్షీ, సుందరేశ్వరుడు, గణేశ ఆలయాలు – పార్వతీ పరమేశ్వరుల శక్తి ఇక్కడుందని భక్తుల విశ్వాసం

8.ద్రౌపది ఆలయం – ఇక్కడ నుంచి గిరి దర్శనం అద్భుతంగా ఉంటుంది…జీవితంలో ఎదురుదెబ్బలు తిని విసిగిపోయినవారికి మానసిక స్థైర్యాన్నిస్తుంది ఈ ఆలయం

9.యమలింగం – యముడు పూజించిన ఈ శివలింగాన్ని దర్శించుకుంటే అకాలమృత్యువు దరిచేరదు. మృత్యుభయం తొలగిపోతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

10. పృథ్విలింగం – అరుణాచలం గిరిచుట్టూ ఉన్న 8 శివలింగాల్లో ఇదొకటి…

11. వాలమూరి గణపతి – తొండం కుడివైపు తిరిగిఉండే ఈ గణపయ్యను దర్శించుకుంటే అదృష్టం వరిస్తుంది

12. దూర్వాస ఆలయం – ఇక్కడ దూర్వాసుడిని కుంతీ దేవి ప్రతిష్టించిందని చెబుతారు – ఇక్కడున్న వేపచెట్టుకి పసుపుదారాలు కడితే సంతాన భాగ్యం కలుగుతుందని…రాళ్లు పేరిస్తే ఇల్లు కట్టుకుంటారని భక్తుల విశ్వాసం.

13. కాట్టు శివాశ్రమం – అటవీ అధికారుల అధీనంలో ఉండే ఈ ప్రదేశానికి వెళ్లాలంటే అనుమతులు తీసుకోవాలి. గిరి ప్రదక్షిణలో భాగంగా ఈ ఆశ్రమాన్ని రోడ్డుపైనుంచి దర్శనం చేసుకుని వెళ్లిపోవచ్చు..

14. అప్పు నంది – పంచభూతాలకు సంబంధించిన నందుల్లో ఇది జలసంబంధ నంది…వివాదాలను సమసిపోయేలా చేసి బంధాలను వృద్ధి చేస్తుంది ఈ నంది దర్శనం

15. తేయునంది – ఈ నందినుంచి చూస్తే గిరి చతుర్ముఖ దర్శనం ఉంటుంది…బ్రహ్మదేవుడు జీవుల సృష్టికి కావాల్సిన జ్ఞానం ఇక్కడి నుంచి పొందారని చెబుతారు.అందుకే ఇక్కడి నుంచి బహ్మదేవుడిలా కనిపిస్తుంది గిరి

16. శోణ తీర్థం – ఇక్కడ రెండు నందులుంటాయి. ఇక్కడున్న వినాయకుడిని జ్యోతి వినాయకుడు అంటారు..రమణమహర్షి గిరిప్రదిక్షిణ చేసేటప్పుడు సేదతీరిన ప్రదేశం ఇది..ఆ మహనీయుడు కూర్చోవడం వల్ల ఈ ప్రదేశం అత్యంత ప్రశాంతంగా ఉంటుంది…

17. నైరుతి లింగం – అష్ట లింగాల్లో నాలుగోది ఇది..రాక్షసరాజు నిరుతి ( నైరుతి దిక్కుకి అధిపతి) ప్రతిష్టించిన విగ్రహం ఇది. ఈ క్షేత్రానికి అధిపతి రాహువు..ఇక్కడ స్వామిని దర్శించుకుంటే దుష్టగ్రహబాధలు తొసగిపోయి కీర్తి ప్రతిష్టలు వస్తాయి..