ఉద్యోగులకు దీపావళి కానుక… ఏకంగా 51 లగ్జరీ కార్లు గిఫ్ట్‌గా ఇచ్చిన కంపెనీ

దీపావళి పండగ అంటే కంపెనీలు.. తమ ఉద్యోగులకు బహుమతులు ఇస్తూ ఉంటాయి. స్వీట్ బాక్స్‌లు, వస్తువులు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంటూ రకరకాల గిఫ్ట్‌లను పండగ సందర్భంగా ఇస్తాయి.


ఇక కొన్ని కంపెనీలు బోనస్‌లు కూడా అందిస్తాయి. దీపావళి పండగ సందర్భంగా.. తమ కంపెనీ ఇచ్చిన గిఫ్ట్‌లను ఉద్యోగులు.. సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ ఉంటారు. మరోవైపు.. పండగకు గిఫ్ట్‌లు ఇవ్వని కంపెనీ ఉద్యోగులు.. తమ యాజమాన్యం తీరుపై విసుక్కుంటూ ఉంటారు. అయితే ఈసారి దీపావళి పండగకు.. ఓ కంపెనీ మాత్రం తమ ఉద్యోగులకు ఖరీదైన కార్లను బహుమతిగా ఇవ్వడం ఇప్పుడు తీవ్ర ఆసక్తికరంగా మారింది. తమ కంపెనీలో పనిచేసే ఉధ్యోగులకు 51 కార్లను గిఫ్ట్‌గా ఇచ్చి.. ఆ సంస్థ యజమాని వారిని ఆశ్చర్యపరిచారు.

చండీగఢ్‌లోని పంచ్‌కులకు చెందిన మిట్స్ హెల్త్‌కేర్ సంస్థ వ్యవస్థాపకుడు, సామాజిక కార్యకర్త అయిన ఎంకే భాటియా.. తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు దీపావళి సందర్భంగా కార్లు ఇవ్వడం విశేషం. ఏకంగా 51 సరికొత్త కార్లను దీపావళి కానుకగా ఇచ్చి తన పెద్ద మనసును చాటుకున్నారు. ఇందులో మహీంద్రా కంపెనీకి చెందిన స్కార్పియో వంటి లగ్జరీ కార్లు ఉండటం మరో విశేషం. అయితే తమ ఉద్యోగులకు కార్లు ఇవ్వడం ఎంకే భాటియాకు ఇదేం కొత్త కాదు. ఇదే విధంగా గత 2 దీపావళి పండగలకు కూడా అందించారు. ఈ 51 కార్ల బహుమతిని ఆయన హాఫ్ సెంచరీ మైలురాయిగా అభివర్ణించారు.

ప్రతి సంవత్సరం ఇంత ఖరీదైన బహుమతులు ఎందుకు ఇస్తున్నారని అడగ్గా.. దానికి ఎంకే భాటియా ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. తన ఉద్యోగులే తమ ఫార్మాస్యూటికల్ కంపెనీలకు వెన్నెముక అని వెల్లడించారు. వారి కష్టం, నిజాయితీ, అంకితభావమే తమ కంపెనీ ఇంతటి విజయం సాధించడానికి పునాది అని పేర్కొన్నారు. వారి కృషిని గుర్తించడం, వారిని మరింత పనిచేసేలా ప్రేరేపించడం తన లక్ష్యమని తెలిపారు. దానివల్ల వారు మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి స్ఫూర్తి పొందుతారని ఎంకే భాటియా స్పష్టం చేశారు.

అయితే ఇది కేవలం పబ్లిసిటీ కోసం కాదని.. తమ కంపెనీలో టీమ్ స్పిరిట్‌ను బలోపేతం చేయడం, ఒక ఫ్యామిలీగా కలిసి పనిచేయడం కోసమేనని ఎంకే భాటియా వివరించారు. తమ టీమ్ సంతోషంగా ఉంటే.. కంపెనీ సహజంగానే అభివృద్ధి చెందుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇక తమ ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇచ్చిన తర్వాత.. వారంతా కార్ల షోరూమ్ నుంచి మిట్స్ హౌస్ వరకు కార్ గిఫ్ట్ ర్యాలీని నిర్వహించడం ద్వారా తమ సంతోషాన్ని పంచుకున్నారు. అది చూసి నగరవాసులు ఆశ్చర్యపోయారు.

గత సంవత్సరం కూడా దీపావళి పండగకు ఒక వారం రోజుల ముందు ఎంకే భాటియా.. తమ కంపెనీలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఉద్యోగులకు 15 కార్లను బహుమతిగా ఇచ్చారు. అంతకుముందు ఏడాది కూడా ఆయన తన సిబ్బందికి 12 కార్లను గిఫ్ట్‌గా ఇచ్చి వార్తల్లో నిలిచారు. ఈసారి 50 కార్లు బహుమతిగా ఇవ్వాలని తాను గతేడాదే అనుకున్నట్లు ఎంకే భాటియా ప్రకటించారు. తమ కంపెనీ సాధారణంగా కొత్త గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని మార్కెట్లోకి వచ్చిన వారిని నియమించుకుని.. వారికి ట్రైనింగ్ ఇస్తుందని తెలిపారు. ఈ ట్రైనింగ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని వైస్ ప్రెసిడెంట్లుగా, ఆపై వారి పనితీరు ఆధారంగా ప్రెసిడెంట్లుగా, డైరెక్టర్లుగా ప్రమోషన్లు ఇస్తామని వెల్లడించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.