New district : కొత్త జిల్లాగా.. పలాస?

జిల్లాల పునర్విభజన మళ్లీ తెరపైకి వచ్చింది.


కొత్త జిల్లాల ఏర్పాటు, సరిహద్దుల నిర్ధారణ, పేర్ల మార్పు, రెవెన్యూ డివిజన్లలో మార్పులు వంటి వాటిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందుకోసం కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటుచేసింది. వీటికి సంబంధించి అధ్యయనం చేసి నెలరోజుల్లో నివేదికలు ఇవ్వాలని మంత్రుల ఉప సంఘానికి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీచేశారు. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటు, డివిజన్లలో మార్పులు వంటి వాటిపై చర్చ ప్రారంభమైంది. అందులో భాగంగా పలాస కేంద్రంగా కొత్త జిల్లా ప్రకటన వస్తుందని అంతా భావిస్తున్నారు. వైసీపీ హయాంలో ప్రతిపాదన ఉన్నా పట్టించుకోలేదని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం పలాసను కొత్త జిల్లాగా ప్రకటిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

వైసీపీ హయాంలో నిర్లక్ష్యం…

పేరుకే శ్రీకాకుళం జిల్లా కానీ.. ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గ ప్రజలు 100 కిలోమీటర్లు ప్రయాణిస్తే కానీ జిల్లా కేంద్రానికి చేరుకోలేని పరిస్థితి. ఏదైనా పనిమీద జిల్లా కేంద్రానికి రావాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల వారు రావాలంటే బస్సులు మారుకొని ప్రయాణించాలి. వైసీపీ హయాంలో కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలోనే పలాసను జిల్లాగా ప్రకటించాలన్న డిమాండ్‌ తెరపైకి వచ్చింది. కానీ అప్పటి పాలకులు పట్టించుకోలేదు. కొత్త జిల్లాల ఏర్పాటు హేతుబద్ధంగా జరగలేదు. శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజాం నియోజకవర్గాన్ని విజయనగరం జిల్లాలో, పాలకొండ నియోజకవర్గాన్ని పార్వతీపురం మన్యం జిల్లాలో విలీనం చేశారు. కానీ సుమారు ఎనభై నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇచ్ఛాపురం, పలాస, పాతపట్నం నియోజకవర్గాలను మాత్రం శ్రీకాకుళంలోనే కొనసాగించారు. ఈ నియోజకవర్గాల ప్రజలకు పాలనాపరంగా ఎటువంటి మార్పులు లేకపోవడంతో అప్పట్లో నిరాశ చెందారు. ఎంతోచరిత్ర కలిగిన శ్రీకాకుళం జిల్లా నుంచి వేరుచేయడం బాధాకరమే అయినా.. పాలనా సౌలభ్యం కోసం ఈ ప్రాంతీయులు మాత్రం పలాస జిల్లా కేంద్రాన్ని ప్రకటించాలని మనస్పూర్తిగా కోరుతున్నారు.

ఆమోదయోగ్యం

పలాసను జిల్లాగా ప్రకటిస్తే నాలుగు నియోజకవర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉంటుంది. భౌగోళికపరంగా పలాస నాలుగు నియోజకవర్గాలకు మధ్యలో ఉంది. ఇచ్ఛాపురం, పాతపట్నం, టెక్కలి నియోజకవర్గాలకు పలాస-కాశీబుగ్గ జంట పట్టణాలు అందుబాటులో ఉన్నాయి. వర్తక, వాణిజ్యపరంగా హంగులతోపాటు జంట పట్టణాలకు పాలనాపరంగా అనుకూలతలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికే 8 మండలాలతో పలాస రెవెన్యూ డివిజన్‌గా కొనసాగుతోంది. పోలీస్‌ సబ్‌ డివిజన్‌, ఆపై విద్యుత్‌ డివిజన్‌గాను ఉంది. జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే అన్నిరకాల ప్రభుత్వ శాఖలు, కార్యాలయాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకూ ప్రధాన శాఖలు మాత్రమే ఈ నియోజకవర్గాల్లో సేవలందిస్తున్నాయి. మిగతా శాఖలు జిల్లా కేంద్రం నుంచి సమన్వయం చేసుకుంటున్నాయి. తూనికలు, కొలతలు, కాలుష్య నియంత్రణ శాఖ, ఆహార కల్తీ నియంత్రణ, ప్రణాళిక శాఖ..ఇలా అన్నిరకాల శాఖల కార్యాలయాలు శ్రీకాకుళంలోనే ఉన్నాయి. ప్రాంతీయ కార్యాలయాలు సైతం లేవు. అదే పలాస జిల్లా కేంద్రమైతే అన్నిరకాల కార్యాలయాలు అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు సంబంధించి పలాసలో భూముల కొరత లేదు. అధికారులు, ఉద్యోగులకు నివాసయోగ్యంగానూ ఉంటుంది. ప్రముఖ రైల్వేస్టేషన్‌గా పలాస ఉంది. ఏపీఎస్‌ ఆర్టీసీకి సంబంధించి బస్సు డిపో కూడా ఉంది. జిల్లా కేంద్రానికి తగ్గట్టు అన్ని అర్హతలు ఉన్నాయి. పైగా ఉద్దానం, తీరం, మైదానం, ఏజెన్సీ కలగలిపిన ప్రాంతం కావడం కలిసి వచ్చే అంశం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పలాసను జిల్లాగా ఏర్పాటు చేయడంపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని నాలుగు నియోజకవర్గాల ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంలో కూటమి ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

అలా చేస్తారు..

పలాస, ఇచ్ఛాపురం, పాతపట్నం, టెక్కలి నియోజకవర్గాలను కలిపి పలాస జిల్లాను ప్రకటిస్తారని తెలుస్తోంది. అదే జరిగితే శ్రీకాకుళం, నరసన్నపేట, ఆమదాలవలస, ఎచ్చెర్ల నియోజకవర్గాలతో శ్రీకాకుళం జిల్లా కొనసాగనుంది. ఎలా చూసుకున్నా జిల్లా కేంద్రం 50 కిలోమీటర్లలోపే ఉంటుంది. పైగా నియోజకవర్గాల పునర్విభజన ఉండనుంది. కొత్తగా ఏర్పాటయ్యే నియోజకవర్గాలు అనుబంధంగా రెండు జిల్లాల్లో కలిసే అవకాశం ఉంది.

ఆకాంక్షను నెరవేర్చాలి

పలాసను జిల్లాగా ఏర్పాటు చేయడం అవసరం. సుదూర ప్రాంత ప్రజలు పలాస కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తే హర్షిస్తారు. మండలాలను కలిపే సందర్భంలో ప్రజాభిప్రాయం తీసుకోవాలి. పాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం పలాసను కొత్త జిల్లాగా ప్రకటించి.. ఈ ప్రాంతీయులు ఆకాంక్షను నెరవేర్చాలి.

ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గ ప్రజలు శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి వెళ్లి రావాలంటే రోజంతా అవుతోంది. అదే పలాసను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే వ్యయప్రయాసలు తగ్గుతాయి. పాలనాపరమైన సౌలభ్యాలు పెరుగుతాయి. అందుకే కేబినెట్‌ సబ్‌ కమిటీ ఈ విషయంలో సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలి. ప్రజాభిప్రాయం బలంగా వారి దృష్టికి వెళ్లాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.