ప్రస్తుత వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతు భరోసా పథకం కింద రైతులకు ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం అందే అవకాశాలు కనబడడం లేదు.
ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఇంకా మార్గదర్శకాలను రూపొందించకపోవడంతో వచ్చే యాసంగి సీజన్ నుంచి అమలుచేయవచ్చని తెలుస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని ప్రకటించింది. అందులో భాగంగా రైతు భరోసా పథకాన్ని అమలుచేస్తామని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా ఒక్కో ఎకరానికి రెండు సీజన్లకు కలిపి 15 వేల రూపాయలు, కౌలు రైతులకు కూడా అంతే మొత్తాన్ని, రైతు కూలీలకు 12వేల రూపాయల చొప్పున అందజేస్తామని ప్రకటించింది. అంతకుముందు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇదే పథకాన్ని రైతుబంధు పథకంగా అమలుచేసింది. పట్టా కలిగిన వారందరికి సీజన్‌కు 5వేల చొప్పున రెండు సీజన్లకు కలిపి 10 వేల రూపాయల పెట్టుబడి సాయాన్ని అందజేసింది. ఇందులో కౌలు రైతులకు ఎలాంటి సాయాన్ని అందజేయ లేదు. ఈ పథకం అమలుచేసేందుకు అప్పటి ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను అనుసంధానం చేసుకుని నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేసింది. ఈ క్రమంలో సాగులో ఉన్న, సాగులో లేని భూములు, రహదారులు, ప్రాజెక్టుల కింద సేకరించిన భూములకు, నాలా మార్పిడి చేయకుండా వెలసిన రియల్ ఎస్టేట్ వెంచర్లకు, భూస్వాములకు, ప్రభుత్వ ఉద్యోగులకు సైతం ఎలాంటి విధివిధానాలు రూపొందించకుండానే అప్పటి ప్రభుత్వం భూమి పట్టా కలిగిన ప్రతి ఒక్కరికి రైతుబంధు పథకాన్ని అమలు చేసింది. ఈ పథకం ద్వారా జిల్లాలో లక్షా 46వేల మంది రైతులకు 136 కోట్ల రూపాయలను చెల్లిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధు పథకాన్ని సవరించి తాము ప్రకటించిన రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని భావించింది. గడిచిన యాసంగి సీజన్‌లో పాత విధానంలోనే రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించింది. వానాకాలం సీజన్ ఆరంభం కావడంతో రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూశారు. కొత్త పథకాన్ని అమలుచేస్తారా, పాత పథకం ప్రకారమే పెట్టుబడి సొమ్మును ఖాతాల్లో జమ చేస్తారా అనే చర్చ రైతుల్లో నడిచింది.
ఖరారు కాని మార్గదర్శకాలు..
రైతుభరోసా కింద పెట్టుబడి సాయం ఇచ్చే దానికంటే ముందే ఆగస్టు 15వ తేదీ వరకు రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణ మాఫీ పథకాన్ని అమలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రకటించారు. జూన్ 21న జరిగిన మంత్రి మండలి సమావేశంలో కూడా ముందుగా రుణ మాఫీ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సభ్యులుగా ఉప సంఘాన్ని నియమించారు. ఈ ఉప సంఘం రైతు సంఘాలు, రైతు కూలీ సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, వివిధ వర్గాల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి జూలై 15లోపు నివేదిక అందజేయాలని ప్రభుత్వం పేర్కొంది. ఈమేరకు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిధిలో రైతులతో సమావేశాలు నిర్వహించి రైతుల నుంచి రైతు భరోసా పథకం అమలు గురించి అభిప్రాయ సేకరణ చేశారు. ఆ తర్వాత మంత్రివర్గ ఉప సంఘం ఉమ్మడి జిల్లాల వారీగా రైతులు, రైతు సంఘాల నాయకులు, వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహించి అభిప్రాయ సేకరణ చేశారు. ఈ పథకాన్ని 10 ఎకరాల వరకు పరిమితం చేయాలని కొందరు, 5 ఎకరాల వరకే ఇవ్వాలని కొందరు, రహదారులు, కొండలు, గుట్టలు, బంచరాయి భూములు, సాగుకు యోగ్యం కానీ భూములు, ప్రజాప్రయోజనాల కోసం ప్రభుత్వం సేకరించిన భూములు కలిగిన వారికి, ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వవద్దని కొందరు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. వీటిపై మంత్రివర్గ ఉప సంఘం నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అప్పగించిన తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో చర్చ పెట్టాల్సి ఉంది. ప్రభుత్వం రుణ మాఫీ డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయడంపై దృష్టి సారించింది. మొదటి విడతలో లక్ష రూపాయల వరకు, రెండవ విడతలో లక్షా 50 వేల రూపాయల వరకు మాఫీ చేసింది. జిల్లాలో రెండు విడతల్లో 42,962 మంది రైతులకు 271 కోట్ల 85 లక్షల రూపాయలు మాఫీ చేశారు. రుణ మాఫీ అందరికి కాకపోగా, కనీసం రుణ మాఫీ అయినా అందుతుందోనని రైతులు ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 2 వరకు నడిచిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రైతుభరోసా అంశం చర్చకు రాకపోవడంతో ఈ వానాకాలం సీజన్‌కు రైతులకు పెట్టుబడి సాయం అందే అవకాశాలు కనబడడం లేదు.