దళిత హెడ్ మాస్టర్పై మతోన్మాదులు దాడి చేయటం అమానుషమనీ, నిందితులను తక్షణమే ఆరెస్టు చేసి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.
ఈ మేరకు శనివారం హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర వర్కింగ్ కమిటీ సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ తీర్మానాన్ని ప్రవేశ పెట్టగా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ రమ బలపర్చగా కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కారాములు, పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం, తుక్కుగూడ గ్రామ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న రాములు (దళిత తరగతికి చెందిన )పై మతోన్మాద మూకలు భక్తి ముసుగులో దాడి చేశారని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తూ భావిభారత పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయుల విధులను ఆటంకపర్చటం నేరమని పేర్కొన్నారు.
విధి నిర్వహణలో భాగంగా పాఠశాలలో ఒక విద్యార్థిని లెక్కలు అడిగే సందర్భంగా నిలబెట్టారనీ, దీన్ని సోషల్ మీడియాలో వక్రీకరిస్తూ అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థినిని నిలబెట్టారనే నెపంతో కొంతమంది మతోన్మాద మూకలు హెచ్ఎం రాములుపై దాడి చేశారని తెలిపారు. ప్రధానోపాధ్యాయుడు క్షమాపణ చెప్పినప్పటికీ వినకుండా, అయ్యప్ప మాల ధరించిన విద్యార్థితో పాటు ఇతర స్వాములు కాళ్ళను రాములుతో మొక్కించడం హేయమైన చర్య అనీ, పాఠశాలల్లో మతోన్మాదులు ఈ విధమైన అమానుష చర్యలకు పాల్పడటం మానుకోవాలని హెచ్చరించారు. గతంలో కూడా నిజామాబాద్ జిల్లా వర్నిలో ఒక పాఠశాలలో విద్యార్థులను ఒక టీచర్ శాస్త్రీయ భావాలను, దృక్పథాన్ని బోధించడాన్ని సాకుగా తీసుకొని మతోన్మాదులు అతనిపై దాడి చేసి, ఊరేగించి దేవుని గుడికి తీసుకెళ్ళి బలవంతంగా మొక్కించి, క్షమాపణ చెప్పించిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం మతోన్మాదులకు ఊతం ఇచ్చే విధంగా వ్యవహరించడం, పార్లమెంట్లోనే కేంద్రమంత్రి అమిత్ షా అంబేద్కర్, రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం లాంటి చర్యలు మతోన్మాదుల దుశ్చర్యలకు మరింత బలాన్నిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు భవిష్యత్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.