ఏయూ విద్యార్థిని ఫిర్యాదు.. వెంటనే మంత్రి స్పందన

ఆంధ్రవిశ్వవిద్యాలయంలో జరుగుతున్న అవకతవకలపై ఏయూ న్యాయ కళాశాల విద్యార్థిని అంజన ప్రియ వాట్సప్‌ ద్వారా చేసిన ఫిర్యాదుపై మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్‌ స్పందించారు.


ఆంధ్రవిశ్వవిద్యాలయంలో జరుగుతున్న అవకతవకలపై ఏయూ న్యాయ కళాశాల విద్యార్థిని అంజన ప్రియ వాట్సప్‌ ద్వారా చేసిన ఫిర్యాదుపై మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్‌ స్పందించారు. శనివారం విద్యపై ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. దీంతో ఉన్నత విద్యాశాఖాధికారులు ఆమెకు ఫోన్‌ చేసి వివరాలు రాబట్టారు.

‘రాజకీయ ప్రయోజనాల కోసం ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి, వర్సిటీలోని కీలక అధికారులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రశ్నించినందుకు నన్ను ఏయూ మహిళా వసతిగృహం చీఫ్‌ వార్డెన్‌ బెదిరించారు. దీనిపై నేను షెడ్యూల్డ్‌ కులాల జాతీయ కమిషన్‌ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశాను. అడ్డదారిలో రిజిస్ట్రార్‌గా వచ్చిన జేమ్స్‌ స్టీఫెన్‌ ఆ పదవి అర్హులు కారు. ఉపకులపతి.. ఎన్నికల సమయంలో విశ్వవిద్యాలయ వనరులు, నిధులను దోచేశారు.

వర్సిటీలో రాజకీయ నాయకులు విగ్రహాలు, పుట్టినరోజు వేడుకలు, జెండాలు, కార్లతో ర్యాలీలు తీసి కలకలం సృష్టించారు. ఒక ప్రొఫెసర్‌ ఏయూలో 1400 పీహెచ్‌డీలు అమ్ముకున్నారు. ఏయూలో ఫైళ్లు మాయం కాకముందే సిటింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి. వందేళ్ల పండగకు ఏయూ ముస్తాబవుతున్నవేళ ఏయూ ప్రతిష్ఠ ఇనుమడింపజేయడానికి వర్సిటీలో నెలకొన్న అవినీతిని పెకిలించాలి’ అని తాను ఫిర్యాదులో పేర్కొన్నట్లు అంజన ప్రియ తెలిపారు.

తన ఫిర్యాదు నేపథ్యంలో మంత్రి లోకేశ్‌ పీఏ మాట్లాడారని, తర్వాత విద్యపై జరిపిన సమీక్షలో మంత్రి ప్రస్తావించడంతో ఉన్నత విద్యాశాఖాధికారులు తనకు ఫోన్‌ చేసి, వివరాలు తెలుసుకున్నారని చెప్పారు. తన ఫిర్యాదుకు ఒక్కపూటలోనే స్పందన వస్తుందని భావించలేదన్నారు.