ఉపవాసం తర్వాత బరువు పెరగకుండా

దసరా శరన్నవరాత్రులు ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని భక్తితో సేవించిన వారంతా ఉపవాస దీక్షలు ముగించుకొని సాధారణ జీవనశైలికి అలవాటు పడుతున్నారు. అయితే ఇలా ఉపవాసం పూర్తయ్యాక చాలామంది త్వరితగతిన బరువు పెరుగుతారంటున్నారు నిపుణులు. ఆహారం విషయంలో చేసే కొన్ని పొరపాట్లే ఇందుకు కారణమంటున్నారు. ఇవి జీర్ణవ్యవస్థ పైనా ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందంటున్నారు. మరి, ఇంతకీ ఉపవాసం ముగిశాక బరువు పెరగడానికి గల కారణాలేంటి? ఈ సమయంలో బరువును అదుపులో ఉంచుకోవాలంటే ఏం చేయాలి? తెలుసుకుందాం రండి..


నవరాత్రుల్లో ఒక్కొక్కరూ ఒక్కో రకమైన ఉపవాస దీక్ష తీసుకుంటారు. కొందరు పండ్లు, కాయగూరలు.. వంటి సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటే.. మరికొందరు ఘనాహారమేమీ తీసుకోకుండా కేవలం ద్రవాహారమే తీసుకొంటుంటారు. ఏదేమైనా ఈ కఠిన ఉపవాస దీక్ష.. బరువు తగ్గేందుకు దోహదం చేస్తుందంటున్నారు నిపుణులు. అయితే దీక్ష విరమించాక చాలామంది వేగంగా బరువు పెరిగే అవకాశాలు ఎక్కువంటున్నారు. ఇందుకు ఆహారం విషయంలో నిర్లక్ష్యంగా ఉండడమే కారణమట!

అవి తింటున్నారా?

అప్పటిదాకా ఉపవాస దీక్ష చేయాలన్న లక్ష్యంతో ఆహార కోరికలను అదుపు చేసుకుంటూ ముందుకు సాగుతాం. అదే ఒక్కసారి దీక్ష విరమించాక మనసు రిలాక్సవుతుంది. ఈ సమయంలో ఆహారం విషయంలో ఎలాంటి నిబంధనలు అక్కర్లేదన్న నిర్లక్ష్యం ఎక్కువవుతుంది. నూనెలు, మసాలాలు, చక్కెర.. మొదలైనవి  అధికంగా ఉండే జంక్‌ఫుడ్ పైకి మనసు లాగేలా చేస్తుంది. ఇంకేముంది? ముందూ వెనకా ఆలోచించకుండా ఆయా పదార్థాల్ని తినేస్తుంటాం. ఉపవాస దీక్ష తర్వాత వేగంగా బరువు పెరిగేందుకు ఇదీ ఓ కారణమే అంటున్నారు నిపుణులు.

అంతేకాదు.. ఆహారం విషయంలో ఇలా నిర్లక్ష్యంగా ఉండడం వల్ల ఆరోగ్యం పైనా ప్రతికూల ప్రభావం పడుతుందని చెబుతున్నారు. అదెలాగంటే.. ఉపవాసం సమయంలో ఆహారం ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల జీర్ణవ్యవస్థ, జీవక్రియలకు కాస్త విశ్రాంతి దొరుకుతుంది. అదే దీక్ష ముగిసిన వెంటనే ఎక్కువగా ఆహారం తిన్నా, అదీ అనారోగ్యకరమైన ఆహారం తీసుకున్నా.. జీర్ణవ్యవస్థ అందుకు అనుగుణంగా పనిచేయలేదు.. తద్వారా వాటిని అరిగించుకోలేదు. దాంతో వికారం, వాంతులు, మలబద్ధకం, గుండెలో మంట.. వంటి సమస్యలు తలెత్తుతాయంటున్నారు.

నెమ్మదిగా అలవాటు చేయండి!

ఉపవాస దీక్షకు అలవాటైన శరీరం తిరిగి సాధారణ జీవనశైలికి మారేందుకు కొంత సమయం పడుతుంది. కాబట్టి ఈ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే అప్పటిదాకా కొద్ది మోతాదులోనే.. సులభంగా జీర్ణమయ్యే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ నెమ్మదిగా జీర్ణశక్తిని పెంచుకుంటూ పోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో పీచు, ప్రొబయాటిక్స్‌ ఎక్కువగా ఉండే పదార్థాల్ని మెనూలో చేర్చుకోవాలి. పప్పులు, అవకాడో, పండ్లు, నట్స్‌, కాయధాన్యాలు.. వంటి వాటిలో పీచు ఎక్కువగా లభిస్తుంది. ప్రొబయాటిక్స్‌ కోసం పెరుగు, పచ్చళ్లు, ఇడ్లీ/దోసె.. వంటివి తీసుకోవాలి. ఇవి తేలిగ్గా జీర్ణమవడంతో పాటు అరుగుదలనూ ప్రేరేపిస్తాయి.

బరువు పెరగకుండా..!

ఉపవాసం తర్వాత జీర్ణశక్తిని పెంచుకోవడానికి తేలిగ్గా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు తీసుకోవడంతో పాటు.. బరువు పెరగకుండా ఉండేందుకు కొన్ని నియమాలు పాటించడమూ ముఖ్యమంటున్నారు నిపుణులు.

⚛ క్రమశిక్షణ, ప్రణాళికతోనే దేన్నైనా అలవాటు చేసుకోగలుగుతాం. ఉపవాసం తర్వాత బరువు అదుపులో ఉంచుకోవాలన్నా ఇదే నియమం వర్తిస్తుంది. కాబట్టి జంక్‌ఫుడ్‌/చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలకు దూరంగా ఉంటూ.. ఆరోగ్యకరమైన పదార్థాలు మాత్రమే తీసుకోవాలన్న నియమం పెట్టుకుని దాన్నే అనుసరించాలి.

⚛ కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా బరువును అదుపులో ఉంచుకోవచ్చంటున్నారు నిపుణులు. దీనివల్ల శరీరంలో అనవసర కొవ్వులు పేరుకుపోకుండా.. తద్వారా బరువు పెరగకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు.

⚛ తగినన్ని నీళ్లు తాగడమూ ముఖ్యమే! తద్వారా శరీరంలో తేమ స్థాయులు తగ్గకుండా జాగ్రత్తపడచ్చు.

⚛ మనసు పెట్టి తినడం వల్ల ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోకుండా అదుపు చేసుకోవచ్చు. ఇది కూడా బరువు అదుపులో ఉంచుకునేందుకు చక్కటి మార్గమే!

⚛ తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణశక్తిని ప్రేరేపించుకోవచ్చు. ఇదీ పరోక్షంగా బరువు పెరగకుండా చేస్తుంది.

⚛ బరువు అదుపులో ఉంచుకోవడానికి వ్యాయామం చక్కటి ప్రత్యామ్నాయం అంటున్నారు నిపుణులు. అయితే ఉపవాసం తర్వాత.. తేలికపాటి వ్యాయామాలతో ప్రారంభించి.. క్రమంగా తీవ్రతను పెంచుకుంటూ పోవడం వల్ల ఇటు ఆరోగ్యంపై, అటు శరీరంపై ప్రతికూల ప్రభావం పడకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు.

⚛ నిద్రలేమి క్రమంగా ఒత్తిడికి దారితీస్తుంది. ఇది పరోక్షంగా బరువు పెరిగేందుకు కారణమవుతుంది. కాబట్టి రోజూ రాత్రి పూట కనీసం ఏడెనిమిది గంటలు సుఖంగా నిద్ర పోయేలా ప్లాన్‌ చేసుకోవాలంటున్నారు నిపుణులు.

అయితే ఇన్ని చేసినా ఉపవాసం తర్వాత బరువు పెరిగినట్లు గమనిస్తే, ఇతరత్రా జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తినట్లు గుర్తిస్తే.. వెంటనే డాక్టర్‌ను సంప్రదించి తగిన చికిత్సలు తీసుకోవడం, సలహాలు పాటించడం మంచిది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.