ఏపీలో కొన్నిరోజులుగా పలు ప్రాంతాల్లో దివ్యాంగులు తమ పెన్షన్లు రద్దు అయిపోయాయని రోడ్డెక్కిన వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి దివ్యాంగుల పెన్షన్లలో చాలా మంది తమ వైకల్య శాతాన్ని చూపేందుకు తాత్కాలిక సర్టిఫికెట్లు ఇచ్చారు.
ఇలాంటి వారి పెన్షన్లను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. వైకల్య శాతాన్ని చూపే పర్మినెంట్ సర్టిఫికెట్ ఇస్తే పెన్షన్లను తిరిగి పునరుద్ధరిస్తామని చెప్పారు. అయితే వైకల్య శాతాన్ని నిర్ధారించే సదేరాం క్యాంపుల ఏర్పాటు, బాధితులు వైద్యుల వద్దకు వెళ్లడం ఒకింత సమయాభావంతో కూడుకున్న పనే. ఈ విషయాన్ని అధికారులు అంతగా పట్టించుకున్నట్లు లేదు. అయితే దివ్యాంగుల నిరసనల విషయం తన దృష్టికి రావడంతో సీఎం నారా చంద్రబాబు నాయుడు తక్షణమే నిలిపేసిన పెన్షన్లను పునరుద్ధరించాలని మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.
చంద్రబాబు ఆదేశాలతో దివ్యాంగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి దివ్యాంగుల పేరిట వైకల్యం లేకున్నా వైసీపీ హయాంలో చాలా మంది దివ్యాంగుల పెన్షన్లను తీసుకున్నారు. వారందిరికీ ఇప్పటికీ దివ్యాంగుల పెన్షన్లు అందుతూనే ఉన్నాయి. ఈ వ్యవహారంపై గత కొంతకాలంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అర్హులకు దక్కాల్సిన పెన్షన్లు అనర్హులకు దక్కితే ప్రభుత్వం లక్ష్యం ఎక్కడ నెరవేరుతుందన్న భావన అందరిలోనూ వ్యక్తమైంది. దీనికీ తోడు సోషల్ మీడియాతో తానేమీ దివ్యాంగుడిని కాదని, అయినా తాను ఆ కోటా పెన్షన్ తీసుకుంటున్నానని ఓ వ్యక్తి పెట్టిన పోస్టు వైరల్ అయ్యింది. దీంతో దీనిపై దృష్టి సారించిన అధికారులు… దివ్యాంగుల వైకల్య శాతం సర్టిఫికెట్లపై వెరిఫికేషన్ ప్రారంభించారు.
ఈ వెరిఫికేషన్ లో చాలా మంది తమ వైకల్య శాతాన్ని చెప్పేందుకు దివ్యాంగులు టెంపరరీ సర్టిఫికెట్లను మాత్రమే అందజేసినట్లు తేలింది. ఈ సర్టిఫికెట్లు ఆమోదయోగ్యం కాదని భావించిన అధికారులు.. అలా టెంపరరీ సర్టిఫికెట్లు అందజేసిన వారందరికీ నోటీసులు జారీ చేసి ఆ తర్వాత వారి పెన్షన్లను తాత్కాలికంగా నిలిపివేశారు. వైకల్య శాతంపై పర్మనెంట్ సర్టిఫికెట్లు అందజేస్తే… ఆ మరుక్షణమే పెన్షన్లను పునరుద్ధరిస్తామని చెప్పారు. అయితే తమ శరీరంపై బహిరంగంగానే కనిపిస్తున్న వైకల్యం గురించి ఏమంటారు? అంటూ దివ్యాంగులు ప్రశ్నిస్తున్నారు. కళ్ల ముందే తమ వైకల్యం కనిపిస్తుంటే… సర్టిఫికెట్లు ఇంకెందుకయ్యా అని కూడా కొందరు నిలదీస్తున్నారు.
దివ్యాంగుల పెన్షన్ల నిలిపివేతపై పలు ప్రజా సంఘాలు సోమవారం ఏపీవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద దర్నాలకు దిగాయి. దివ్యాంగులు కూడా ఆయా ప్రాంతాల్లో నిరసనలకు దిగుతున్నారు. ఈ పరిస్థితులను అధికారులు చంద్రబాబుకు వివరించారు. పరిస్థితిని ఉన్నతాధికారులతో సమీక్షించిన చంద్రబాబు… “ఇదివరకు టెంపరరీ సర్టిఫికెట్ల మీదే పెన్షన్లు ఇచ్చాం కదా… ఇప్పుడు నిలిపివేయడం ఎందుకు? వాటిని కొనసాగించండి. అదే సమయంలో దివ్యాంగుల వైకల్య శాతాన్ని నిర్ధారించే దిశగా పకడ్బందీ చర్యలు చేపట్టండి” అని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాబు ఆదేశాలతో పెన్షన్లు నిలిచిపోయిన దివ్యాంగులకు సెప్టెంబర్ 1న పెన్షన్లు అందనున్నాయి.




































