‘సినిమా రివ్యూ: ‘బచ్చల మల్లి’

www.mannamweb.com


ఈ మధ్య కాలంలో రిలీజ్‌కి ముందే మంచి బజ్ క్రియేట్ చేసిన సినిమా ‘బచ్చల మల్లి’. అల్లరి నరేష్, అమృతా అయ్యర్ జంటగా వచ్చిన ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి టాక్ తెచ్చుకుందో తెలియాలంటే సినిమా కథలోకి వెళ్లాల్సిందే.

కథ:
తూర్పు గోదావరి జిల్లా తుని గ్రామానికి చెందిన కుర్రోడు బచ్చల మల్లి (అల్లరి నరేష్). చిన్నతనం నుంచీ చాలా తెలివైనోడు. తన తెలివితేటలతో 10 తరగతిలో జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధిస్తాడు. అలాంటిది, తెలిసీ తెలియని వయసులో తన తండ్రి చేసిన ఓ తప్పు కారణంగా మూర్ఖుడిగా మారిపోతాడు. చెడు అలవాట్లకు బానిసై చదువు కూడా మధ్యలోనే ఆపేస్తాడు. నచ్చింది చేసుకుంటూ పరమ మూర్ఖుడు.. అనే ట్యాగ్ లైన్‌తో ఊరిలోనే ట్రాక్టర్ నడుపుతూంటాడు. అలాంటి బచ్చల మల్లి జీవితంలోకి అనుకోకుండా కావేరి (అమృతా అయ్యర్) అనే అమ్మాయి వస్తుంది. కావేరిని మల్లి ఇష్టపడతాడు. మొదట్లో మల్లి మూర్ఖత్వానికి భయపడి దూరంగా వుండే కావేరి, ఒకానొక సందర్భంలో అతనిలోని మంచితనానికి పడిపోతుంది. తాను కూడా ప్రేమిస్తుంది. అయితే, హద్దులు దాటిన మూర్ఖత్వంతో మల్లి తన జీవితంలో అనూహ్యమైన సంఘటనల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రేమించిన అమ్మాయిని సైతం దూరం చేసుకోవల్సి వస్తుంది. జీవితంలో ఎన్నో ఇంపార్టెంట్ అయినవి కోల్పోవాల్సి వస్తుంది. చివరికి తన మూర్ఖత్వాన్ని మల్లి వదులుకుంటాడా.? అసలు మల్లిి అలా మారడానికి కారణమైన తండ్రి చేసిన తప్పేంటీ.? బచ్చల మల్లి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది.? కథ సుఖాంతమైందా.? లేదా.? తెలియాలంటే ‘బచ్చల మల్లి’ సినిమా ధియేటర్లో చూడాల్సిందే.

నటీనటుల పనితీరు:

అల్లరి నరేష్ అంటే ఓ కామెడీ హీరో గుర్తొచ్చినా.. తనలో ఓ అనూహ్యమైన సీరియస్ విలక్షణమైన నటుడు కూడా వున్నాడని గతంలోనే పలు పాత్రల ద్వారా అల్లరి నరేష్ ప్రూవ్ చేసుకున్నాడు. అలా తనలోని నటుడికి ఛాలెంజ్ విసిరే పాత్రే ఈ బచ్చల మల్లి. ఈ పాత్రలో అల్లరి నరేష్ చక్కగా ఒదిగిపోయాడు. ఎమోషన్స్ పండించడంలోనూ తనదైన నటన చూపించాడు. హీరోయిన్ అమృతా అయ్యర్‌కి ‘హనుమాన్’ సినిమా తర్వాత మరో మంచి పాత్ర దక్కింది ఈ సినిమాతో. సీనియర్ నటి రోహిణి, రావురమేష్, కన్నడ నటుడు అచ్యుత్ రావు, వైవా హర్థ తదితరులకు మంచి స్కోప్ వున్న పాత్రలు దక్కాయ్. అలాగే మిగిలిన పాత్రధారులు తమ తమ పాత్రల్లో పరిధి మేర నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పనితీరు:

దర్శకుడు సుబ్బు మంగలదేవ్వి కొన్ని యదార్ధ సంఘటనల ద్వారా ఈ కథని ఎంచుకున్నాడని తెలుస్తోంది. మూర్ఖత్వం నరనరాలా జీర్ణించిపోయిన పాత్రే ఈ బచ్చల మల్లి పాత్ర. నెగిటివ్ షేడ్స్‌తో కూడిన హీరోయిజం.. ఈ మధ్య ఒకింత సక్సెస్ ఫార్ములా అనే చెప్పొచ్చు. అయితే, కథలో వున్న బలం, కథనాన్ని నడిపించడంలో హ్యండిల్ చేయలేకపోయాడనిపిస్తుంది కొన్ని కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో. పాత్రల చిత్రీకరణపై పెట్టిన దృష్టి కథనాన్ని బలంగా నడిపించడంలోనూ పెట్టి వుంటే బాగుండనిపిస్తుంది. పతాక సన్నివేశాల్లో వచ్చే ఎమోషన్స్ బాగుంటాయ్. ఇంటర్వెల్‌లో రివీల్ చేసిన క్యారెక్టర్స్ ట్విస్ట్ అనిపిస్తాయ్. కానీ, ఆ తర్వాత రెగ్యులర్ అనిపించేస్తాయ్. విశాల్ చంద్ర శేఖర్ నేపథ్య సంగీతం బాగుంది. ‘మా ఊరి జాతర్లో..’ అనే పాట సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. అలాగే సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్టుగానే వున్నాయ్. ఎడిటింగ్ ఓకే.

ప్లస్ పాయింట్స్:

అల్లరి నరేష్ సాలిడ్ నటన, ఇంటర్వెల్ బ్యాంగ్, సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు..

మైనస్ పాయింట్స్:

రెగ్యులర్ అనిపించిన చాలా సన్నివేశాలు, ఆకట్టుకోని ఎమోషన్స్, మూర్ధత్వం నిండిన పాత్రగా హీరో పాత్రతో ప్రేక్షకుడు కనెక్ట్ అయినప్పటికీ పతాక సన్నివేశాల్లో ఆ పాత్రకు ఇచ్చిన ముగింపు కన్నిన్సింగ్‌గా అనిపించకపోవడం..

చివరిగా:
‘బచ్చల మల్లి’ కళ్లు చెమర్చడం ఖాయమే.!