ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఎదుర్కొనే ఆరోగ్య సమస్యల్లో వెన్ను నొప్పి ఒకటి. దీనివల్ల రోజువారీ పనులు చేసుకోవడం కూడా కష్టంగా మారుతుంది.
కొన్నిసార్లు నడవడం సైతం సాధ్యపడదు. బరువులు ఎత్తడం, ఎక్కువ సేపు కూర్చోవడం, కూర్చుకునే భంగిమ సరిగా లేకపోవడం ఇలా వెన్ను నొప్పి (Back pain) రావడానికి చాలా కారణాలే ఉండొచ్చు. అయితే, దీనికి ఉపశమనం కూడా చాలా సులభంగానే ఉంటుంది. ఇంట్లో ఉండే కొన్ని చిట్కాలతో ఒక్కవారంలో దీన్ని తగ్గించుకోవచ్చు. అసలు వెన్ను నొప్పికి కారణం ఏంటి, దీని నుంచి ఎలా బయటపడాలో తెలుసుకోండి.
కూర్చొనే భంగిమ: ఎక్కువ సేపు కూర్చోవడం, కూర్చునే భంగిమ సరిగా లేకపోవడం వల్ల వెన్నుపై భారం పడి అది నొప్పికి (Back pain) దారితీస్తుంది.
కండరాళ్లపై ఒత్తిడి: కఠిన వ్యాయామాలు చేయడం, బరువులు ఎత్తేటప్పుడు సరైన పద్ధతులు పాటించకపోవడం వల్ల కండరాళ్లు తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. ఇది కూడా వెన్ను నొప్పికి (Back pain) దారి తీస్తుంది.
జీవనశైలి: వెన్ను నొప్పికి జీవనశైలి కూడా కారణం కావొచ్చు. ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా నిశ్చలంగా ఉండడం వల్ల వెన్ను బలహీనపడుతుంది.
ఒత్తిడి: మానసిక ఒత్తిడి వెన్నులో ఉండే కండరాళ్లపై ప్రభావం చూపుతుంది. ఇది కూడా నొప్పికి దారితీస్తుంది.
ఆరోగ్య సమస్యలు: డిస్క్‌లో ఇబ్బందులు, ఆర్థరైటిస్, యాస్టియోపోరోసిస్ వంటి ఆరోగ్య సమస్యలు దీర్ఘకాల వెన్ను నొప్పికి (Back pain) కారణమవుతుంటాయి.
* కొన్ని నివారణ మార్గాల ద్వారా ఇంట్లోనే వెన్ను నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు. అవేంటో చూద్దాం.
హీట్ అండ్ కోల్డ్ థెరపీ
వరుసగా రెండు రోజులు కోల్డ్ ప్యాక్‌తో నొప్పి ఉన్న ప్రాంతంలో 20 నిమిషాల పాటు కాపడం పట్టాలి. దీని వల్ల వాపు తగ్గుతుంది. తర్వాత హీటింగ్ ప్యాడ్‌తో కాపడం పడితే బిగుసుకుపోయిన కండరాళ్లు రిలాక్స్ అయ్యి రక్త ప్రసరణ సరిగా జరుగుతుంది. ఇది నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
యోగాసనాలు
కొన్ని రకాల యోగాసనాలు వెన్ను నొప్పి నివారణకు బాగా పనిచేస్తాయి. నిపుణులకు మీ కండిషన్‌ను పూర్తిగా వివరించి ఎలాంటి ఆసనాలు మీ సమస్యను తగ్గిస్తాయో తెలుసుకొని వాటిని పాటిస్తే కొన్ని రోజుల్లోనే నొప్పి తగ్గుముఖం పడుతుంది.
యాక్టివ్‌గా ఉండాలి
నిత్యం పడకపై ఉండడం తగ్గించాలి. వాకింగ్, స్విమ్మింగ్ వంటి యాక్టివిటీస్ చేస్తుండాలి. ఫలితంగా వెన్నులో కదలికలు వచ్చి బలపడేందుకు అవకాశం ఉంటుంది.
భంగిమను మార్చాలి
కూర్చొని పనిచేసేవారు.. సరైన భంగిమను మెయింటైన్ చేయాలి. అందుకోసం పని ప్రదేశంలో సరైన మార్పులు చేసుకోవాలి. డెస్క్, కంప్యూటర్‌ను అడ్జస్ట్ చేసుకోవాలి. ఎర్గోనామిక్ చైర్‌ను వాడాలి. వెన్ను నిటారుగా ఉంచి కూర్చోవాలి.
ఎప్సమ్ సాల్ట్‌తో వేడినీళ్ల స్నానం
వెచ్చని నీళ్లలో ఎప్సమ్ సాల్ట్‌ను వేసి స్నానం చేస్తే కండరాళ్లు రిలాక్స్ అయ్యి నొప్పి తగ్గుతుంది.
హెర్బల్ రెమిడీస్
పసుపు వేసి మరిగించిన పాలు లేదా టీ, అల్లం వాటర్ తాగితే నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు. ఇవి సహజ యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేసి నొప్పిని తగ్గిస్తాయి.
పడుకునే పొజిషన్
వెన్నులో ఉండే సహజసిద్ధమైన కర్వ్‌ను మెయింటైన్ చేసేలా పరుపుపైనే పడుకోవాలి. దిండును సైతం అందుకు అనుగుణంగా సరిచేసుకోవాలి.
ఈ చిట్కాలతో నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. కానీ, దీర్ఘకాలం కొనసాగితే మాత్రం కచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించాలి. ఇంకా ఏదైనా సమస్య వల్ల కూడా వెన్నులో నొప్పి పుట్టే అవకాశం ఉంది. అందువల్ల ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ సూచనలను పాటించాలి.