తక్కువ ఖర్చుతో…పంటభూమిలో విషానికి బ్యాక్టీరియాతో చెక్

www.mannamweb.com


రసాయనిక వ్యవసాయం వల్ల కాలుష్య కాసారంగా మారిపోయిన వ్యవసాయ భూములను తక్కువ ఖర్చుతో, సులభంగా, సమర్థవంతంగా శుద్ధి చేసే కొన్ని జాతుల సూక్ష్మజీవుల మిశ్రమాన్ని ముంబై ఐఐటి పరిశోధకులు కనుగొన్నారు.

రసాయనిక పురుగుమందుల వల్ల, ఇతరత్రా కాలుష్య కారకాల వల్ల పంట భూములు నాశనమవుతున్న సంగతి తెలిసిందే.

విషతుల్య కాలుష్య కారకాలను హరించటంతో పాటు నేలలో ఉన్నప్పటికీ మొక్కలకు అందుబాటులో లేని పోషకాలను అందుబాటులోకి తేవటం ద్వారా పనిలో పనిగా పంట దిగుబడిని కూడా పెంపొందించడానికి ఈ ‘బ్యాక్టీరియా కాక్టెయిల్‌’ ఉపయోగపడుతున్నదని ముంబై ఐఐటి పరిశోధకులు ప్రకటించారు.

ముంబై ఐఐటిలో బయోసైన్సెస్, బయోఇంజినీరింగ్‌ విభాగం అధిపతి ప్రొఫెసర్‌ ప్రశాంత్‌ ఫలే మార్గ దర్శకత్వంలో సందేశ్‌ పపడే ఈ పరిశోధన చేశారు. మట్టిలోని విషాలను విచ్చిన్నం చేసి తీసివేయటంతో పాటు ఈ బ్యాక్టీరియా అధికోత్పత్తికి దోహదం చేసే గ్రోత్‌ హార్మోన్ల పెరుగుదలకు ఊతం ఇస్తున్నాయని, అదేసమయంలో హానికారక శిలీంధ్రాలను అరికడుతున్నాయని, తద్వారా పోషకాల లభ్యత పెరుగుతోందని గుర్తించారు. రసాయనిక పురుగుమందులు, తెగుళ్ల మందుల వాడకాన్ని తగ్గించటానికి.. నేలల ఆరోగ్యం, ఉత్పాదకశక్తిని పెంపొందించడానికి ఉపయోడపడుతోందని ప్రొఫెసర్‌ ప్రశాంత్‌ ఫలే వెల్లడించారు.

రసాయనిక పురుగుమందులు, తెగుళ్ల మందులలోని బెంజీన్‌ వంటి ఆరోమాటిక్‌ కాంపౌండ్స్‌ వల్ల నేలలు కలుషితం కావటం వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య. ఈ సమ్మేళనాలు విషతుల్యమైనవి. విత్తనం మొలక శాతాన్ని ఇవి తగ్గిస్తాయి. పంట మొక్కల ఎదుగుదలకు, దిగుబడికి ప్రతిబంధకంగా మారుతున్నాయి. ధాన్యాలు, గింజల్లో, మొక్క భాగాల్లో ఈ విషతుల్యమైన సమ్మేళనాలు చేరి΄ోతాయి. కార్బారిల్, నాఫ్తలిన్, బెంజోయేట్, 2,4-డ్రైక్లోరోఫెనాక్సియేసెటిక్‌ ఆసిడ్, థాలేట్స్‌ను పురుగుమందుల్లో విస్తృతంగా వాడుతున్నారు. సౌందర్యసాధనాలు, దుస్తులు, నిర్మాణ రంగం, ఆహార రంగంలో వాడే ప్రిజర్వేటివ్స్, అద్దకం, పెట్రోలియం, ప్లాస్టిక్‌ ఉత్పత్తి రంగాల్లో కూడా ఈ విషతుల్యమైన సమ్మేళనాలను వాడుతున్నారు. వీటి వల్ల మట్టి, నీరు, గాలి కలుషితం అవుతున్నాయి.

అయితే, ఈ కలుషితాలను తొలగించడానికి ప్రస్తుతం అనుసరిస్తున్న రసాయనిక పద్ధతి లేదా కలుషితమైన మట్టిని తొలగించటం వంటి పద్ధతులు అధిక ఖర్చుతో కూడినవే కాక సమస్యను సమూలంగా పరిష్కరించకుండా తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే కలిగిస్తున్నాయి. ఈ దృష్ట్యా సమస్యాత్మక నేలలను శుద్ధి చేసుకోవటానికి ఐఐటి ముంబై పరిశోధకుల కృషి తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

సహజ పద్ధతిలో శుద్ధి
ఘాటైన వాసనలతో కూడిన రసాయనిక విషపదార్థాలను చక్కగా విచ్ఛిన్నం చేయటానికి సూడోమోనాస్, అసినెటోబాక్టర్‌ తదితర జాతుల బ్యాక్టీరియా ఉపయోగపడుతున్నట్లు గుర్తించారు. ఇవి విషతుల్య సమ్మేళనాలను తిని.. హానికరం కాని, విషరహిత సమ్మేళనాలుగా మార్చుతున్నాయి. ఆ క్రమంలో కలుషిత∙పర్యావరణాన్ని ఇవి సహజంగా శుద్ధి చేస్తున్నాయని ఫలే వ్యాఖ్యానించారు.

పెరిగిన పోషకాల లభ్యత
ఫాస్ఫరస్, పొటాషియం వంటి నీట కరగని స్థూల పోషకాలను ఈ బ్యాక్టీరియా నీట కరిగేలా చేస్తుంది. తద్వారా పంట మొక్కల వేర్లు అదనపు పోషకాలను పీల్చుకునే అవకాశం కల్పిస్తాయి. నిస్సారమైన భూముల్లో పెరిగే పంట ఐరన్‌ను ఎక్కువగా తీసుకోలేకపోతుంటుంది. ఈ సూక్ష్మజీవులు సైడెరోఫోర్స్‌ అనే పదార్ధాన్ని విడుదల చేయటం ద్వారా ఐరన్‌ను సరిగ్గా తీసుకునేలా చేస్తాయి. అంతేకాకుండా ఇండోల్‌ అసెటిక్‌ ఆసిడ్‌ (ఐఎఎ) అనే గ్రోత్‌ హార్మోన్‌ను ఈ బ్యాక్టీరియా విడుదల చేసి దిగుబడిని పెంచుతుంది.

ఇంకా ప్రొఫెసర్‌ ఫలే ఇలా అన్నారు.. ‘సూడోమోనాస్, అసెనెటోబాక్టర్‌ జెనెరకు చెందిన అనేక జాతుల సూక్ష్మజీవుల మిశ్రమాన్ని వాడిన తర్వాత గోధుమ, పెసర పాలకూర, మెంతికూర తదితర పంటల దిగుబడి 40-45% వరకు పెరిగింది.

మట్టిలో రసాయనాలను కొన్ని రకాల బ్యాక్టీరియా విచ్ఛిన్నం చేస్తుంటే, మరికొన్ని సూక్ష్మజీవులు మొక్కల పెరుగుదలను పెంపొందించే హార్మోన్‌ ఉత్పత్తికి, చీడపీడల బెడద నుంచి దీటుగా తట్టుకునేందుకు ఉపయోగపడుతున్నాయని, కలసికట్టుగా పనిచేస్తే కలిగే ప్రయోజనం ఇదే అన్నారు ప్రొ. ఫలే.