ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా బాలినేని.. పార్టీ మార్పు పక్కాగా.. తాజా అప్‌డేట్

www.mannamweb.com


ఏపీ రాజకీయాల్లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హాట్‌టాపిక్‌ మారారు. వైసీపీ అధిష్టానంతో విభేదించి పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం కాకరేపుతోంది.

నేడో రేపో పార్టీ మారతారని జోరుగా టాక్‌ నడుస్తోంది. అంతేకాదు.. పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నా బాలినేని ఖండించకపోవడంతో ఊహాగానాలకు మరింత ఊతమిచ్చినట్లు అవుతోంది. దాంతో.. బాలినేని వైసీపీకి గుడ్‌ బై చెప్పడం ఖాయమని కామెంట్స్‌ తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే.. బాలినేనిని బుజ్జగించేందుకు వైసీపీ ముఖ్యనేతలు రంగంలోకి దిగారు. హైదరాబాద్‌లో ఉన్న బాలినేని ఇంటికి మాజీ మంత్రి విడుదల రజినీతో పాటు కీలక నేతలు వచ్చి.. ఆయన్ను బుజ్జగించే ప్రయత్నం చేశారు. పార్టీ మారొద్దని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.

అంతకుముందు హైదరాబాద్‌లోనే ఒంగోలుకు చెందిన పలువురు ముఖ్యనేతలతో బాలినేని భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఒంగోలు వైసీపీ కార్పొరేటర్లు హాజరు కాగా.. పార్టీ మారే అంశంపై సమాలోచనలు చేసినట్లు టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటికే అనుచరులు, కార్యకర్తలతో బాలినేని వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. అటు.. రజినీ సారథ్యంలో వైసీపీ ముఖ్య నేతలు రావడం.. ఇటు.. వరుస భేటీలతో బాలినేని పార్టీ మార్పు ప్రచారానికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. వాస్తవానికి.. బాలినేని ఎప్పటినుంచో అసంతృప్తిగా ఉన్నారు. గత జగన్‌ ప్రభుత్వంలో.. రెండోసారి విస్తరణలో మంత్రి పదవి నుంచి తొలగించడం.. గత ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ సీటు నిర్ణయం సహా జిల్లా ఇన్‌చార్జ్‌ బాధ్యతలు చెవిరెడ్డికి ఇవ్వడం.. ఆ తర్వాత.. వైసీపీ ఘోరంగా ఓటమి పాలవడంతో బాలినేని పార్టీ మారబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలావుంటే.. బాలినేని వైసీపీకి గుడ్‌ బై చెప్తే.. ఆ తర్వాత ఏ పార్టీలో చేరతారనే అంశంపైనా చర్చలు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం.. ఏపీలో అధికారంలోనున్న కూటమి పార్టీల్లో ఏ పార్టీలో జాయిన్‌ అవుతారనేది ఆసక్తి రేపుతోంది.

బాలినేని పార్టీమార్పు ప్రచారంపై ఎన్నికల్లో ఆయన ప్రత్యర్థి, టీడీపీ ఎమ్మెల్యే.. దామచర్ల జనార్ధన్ స్పందించారు. బాలినేని చెప్పేదొకటి.. చేసేదొకటని.. వయసు రీత్యా ఆయన ఇంట్లో కూర్చుంటే బాగుంటుందన్నారు. ఎన్నికల ముందు కూడా ఇలానే పార్టీ మారతనని బాలినేని ప్రచారం చేశారని తెలిపారు.