- నేటి నుంచి జూన్ 2 వరకు ట్రాన్స్ఫర్లు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని సడలిస్తూ ఆర్థికశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. శుక్రవారం నుంచే ఈ సడలింపు అమలులోకి వస్తుందని, జూన్ రెండో తేదీ వరకు కొనసాగుతుందని వివరించింది. ఈ నెల 31వ తేదీ నాటికి ఒకే స్థానంలో ఐదేళ్ల కన్నా ఎక్కువ కాలం పనిచేసిన వారికి తప్పనిసరిగా బదిలీలు ఉంటాయని స్పష్టం చేసింది. వచ్చే ఏడాది మే 31లోగా ఉద్యోగ విరమణ చేసే వారికి వారి కోరిక మేరకు బదిలీ చేయవచ్చునని పేర్కొన్నారు.
దృష్టి లోపం ఉన్న వారికి, మానసిక సమస్యలతో బాధపడే పిల్లలున్న ఉద్యోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందుబాటులో ఉండే ప్రాంతాలకు బదిలీ చేయవచ్చునని ఆర్థికశాఖ పేర్కొంది. గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకన్నా ఎక్కువ కాలం పనిచేసిన వారు, 40 శాతం కన్నా ఎక్కువ అంగవైకల్యం ఉన్నవారికి కూడా బదిలీల్లో ప్రాధాన్యత ఉంటుందని వివరించారు. భార్య, భర్త, పిల్లలకు కేన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, న్యూరో సమస్యలు, కిడ్నీ మార్పిడి వంటి కీలక వ్యాధులతో సమస్యలు ఉంటే వారికి కూడా బదిలీల్లో ప్రాధాన్యత ఉంటుందని పేర్కొంది. అలాగే కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగం పొందిన వితంతువులకు కూడా బదిలీల్లో అవకాశం ఉంటుందని వివరించింది. దృష్టిలోపం సమస్యలు ఉన్న వారు కోరుకుంటే తప్ప బదిలీలు ఉండవని స్పష్టం చేసింది. స్పౌస్ కేసుల్లో కూడా ఒకే చోటగానీ, దగ్గరలో ఉన్న స్థానంలోగానీ నియమించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొంది. ఉద్యోగుల బదిలీలన్నీ ఐచ్ఛిక బదిలీలుగానే భావించాల్సి ఉంటుందని, వారికి ట్రావెల్ అలవెన్సులు ఉండవని స్పష్టం చేసింది.
































