బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించాలన్న Nirmala Sitharaman,

www.mannamweb.com


కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశంలోని బ్యాంకింగ్ సంస్థలను పెద్ద కోరికే కోరారు. అధిక వడ్డీ రేట్లకు బ్యాంకులు రుణాలను పంపిణీ చేయటం వల్ల అది రుణగ్రహీతలపై ఒత్తిడిని పెంచుతోందని అన్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గిస్తుంటే ఇండియాలో ఆర్బీఐ మాత్రం రేట్లను అధికంగా ఉంచుతుండగా.. ఈ క్రమంలో ఆర్థిక మంత్రి బ్యాంకులకు మాత్రం రేట్లు తగ్గించాలని చెప్పటం ఏంటని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఒక సమావేశంలో నవంబర్ 18న మాట్లాడుతూ ఆమె బ్యాంకర్లకు పై సూచన చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పరిశ్రమల విస్తరణపై ఆధారపడి ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో వికసిత్ భారత్ లక్ష్యాన్ని అందుకోవటానికి తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను అందించటం చాలా కీలకంగా ఆమె పేర్కొన్నారు. కొన్ని సమయాల్లో పరిశ్రమలు తమ సామర్థ్యాలను విస్తరించేందుకు అధిక వడ్డీ రేట్లకు రుణాలు అందుబాటులో ఉండటం పెద్ద సమస్యగా చూస్తున్నాయన్నారు. అందుకే బ్యాంకులు సరసమైన వడ్డీ రేట్లకు రుణాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలో భారత అభివృద్ధికి బ్యాంకులు అండగా నిలవన్నారు.

గతవారం కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సైతం ఇలాంటి ప్రకటన ఒకటి చేశారు. రిజర్వు బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించాలని అప్పుడే ఎకానమీ వేగంగా అభివృద్ధి చెందగలదని పేర్కొన్నారు. అలాగే ద్రవ్యపరపతి విధాన సమీక్ష సమయంలో ఆహార పదార్ధాల ధరలను పరిగణలోకి తీసుకోవటాన్ని రిజర్వు బ్యాంక్ పక్కనపెట్టాలని సైతం పేర్కొన్నారు.

అయితే దీనిపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ సైతం బదులిచ్చిన సంగతి తెలిసిందే. చాలా వాణిజ్య బ్యాంకులు తమ రుణ రేట్లను ఆర్బీఐ మానిటరీ పాలసీ నిర్ణయాలతో సమలేఖనం చేస్తున్న సంగతి తెలిసిందే. అనేక రుణాలు రెపో రేటుతో అనుసంధానించబడ్డాయి. అలాంటప్పుడు సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించకపోతే బ్యాంకులు ఎలా తక్కువ వడ్డీకి రుణాలను అందించగలవనే అనుమానం సామాన్యులకు సైతం వస్తోంది.

అక్టోబర్ ద్రవ్యోల్బణం 6.2 శాతంగా ఉన్నందున డిసెంబర్ పాలసీలో కనీసం 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను ఆర్బీఐ తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోపక్క అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడిగా వచ్చిన వేళ విదేశాల నుంచి దిగుమతులపై ఆయన ఆంక్షలు విధిస్తారని అది పరోక్షంగా ద్రవ్యోల్బణం పెరుగుదలకు ఆజ్యం పోస్తుందని సైతం ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. మెుదటి సారి వడ్డీ రేట్లను తగ్గించకుండా ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం రావటంతో అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గించినా ఇండియన్ సెంట్రల్ బ్యాంక్ ఆ సాహసం చేయలేదు. మరి ఈసారి రేట్ల తగ్గింపు ఎంత ఉంటుందో వేచిచూడాల్సిందే.