ప్రపంచదేశాలను ఆకర్షిస్తూ, గిన్నిస్ రికార్డు సాధనే లక్ష్యంగా ఈ నెల 29న సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన బతుకమ్మ వేడుక విజయవంతం అయ్యేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చెయ్యాలని రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, ధనసరి అనసూయ(సీతక్క) అధికారులను ఆదేశించారు.
ఈ మేరకు బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రులు జూపల్లి, సురేఖ, సీతక్క కలిసి సచివాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ఈ నెల 27న ట్యాంక్‌బండ్‌పై నిర్వహించనున్న బతుకమ్మ కార్నివాల్, 28న బైక్, సైకిల్ ర్యాలీలు, 29న సరూర్‌నగర్ స్టెడియంలో 63 అడుగుల ఎత్తయిన బతుకమ్మ వద్ద 10 వేల మంది మహిళలతో తలపెట్టిన కార్యక్రమాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. సరూర్‌నగర్ స్టేడియంలో గిన్నిస్ రికార్డు లక్ష్యంగా వేడుక చేస్తున్నందున పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.
































