‘బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా అన్ని పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తాం..’ మంత్రి సవిత వెల్లడి

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత తెలిపారు.

ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో జరిగిన సమీక్షలో ఆమె అన్నారు. త్వరలో జరగబోయే మెగా డీఎస్సీకి సంబంధించి 26 జిల్లా కేంద్రాల్లో స్టడీ సర్కిళ్ల ద్వారా శిక్షణ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి సవిత పేర్కొన్నారు. అలాగే ఉచిత డీఎస్సీ శిక్షణ కాలంలో ఒక్కో అభ్యర్థికి స్టైఫండ్‌ కింద రూ.1500లతోపాటు స్టడీ మెటీరియల్‌ కొనుగోలుకు రూ.1000 అదనంగా అందిస్తామని అన్నారు. అయితే కొన్ని జిల్లాల పరిధిలో స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయలేదని, వాటిని కూడా వెంటనే ఏర్పాటు చేసి డీఎస్సీ ఉచిత శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఏపీఈఏపీ సెట్, నీట్‌ ర్యాంకులేకున్నా ఇంటర్‌తో బీఎస్సీ నర్సింగ్‌లో ప్రవేశాలు.. దరఖాస్తులు ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బీఎస్సీ నర్సింగ్‌ కోర్సులో ప్రవేశాలకు తదుపరి చర్యలు చేపట్టింది విద్యాశాఖ. మిగిలి పోయిన కన్వీనర్, యాజమాన్య కోటా సీట్లను ఏపీఈఏపీ సెట్, నీట్‌ ర్యాంకులతో నిమిత్తం లేకుండా కేవలం ఇంటర్‌ మార్కులతో భర్తీ చేసేందుకు అనుమతినిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు 2024-25 విద్యా సంవత్సరం వరకు మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేశారు. 2025-26 నుంచి ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సెల్‌ మార్గదర్శకాలు అనుసరించి ఎన్టీఆర్‌ ఆరోగ్య యూనివర్సిటీ ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు నర్సింగ్‌ ప్రవేశాలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.

పలు కోర్సుల్లో ప్రవేశాలకు కాళోజీ వర్సిటీ నోటిఫికేషన్ జారీ

తెలంగాణ రాష్ట్రంలోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య యూనివర్సిటీ 2024-25 విద్యా సంవత్సరానికి పలు కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్లు విడుదల చేసింది. మేనేజ్‌మెంట్‌ కోటాలో బీడీఎస్‌ ప్రవేశాల్లో భాగంగా రెండో దశ కౌన్సెలింగ్‌లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి మాప్‌అప్‌ రౌండ్‌ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు వెబ్‌ఆప్షన్లకు అవకాశం కల్పించింది. బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీయూఎంఎస్, బీఎన్‌వైఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకూ ప్రకటన వెలువరించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఆయుష్‌ కాలేజీల్లో ప్రవేశాలకు కన్వీనర్‌ కోటా కింద మొదటి దశ కౌన్సెలింగ్‌ ప్రక్రియ కోసం వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలని విద్యార్ధులకు సూచించింది. ఈ మేరకు అక్టోబరు 28 వరకు వెబ్‌ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.