క్రమశిక్షణతో ఉండండి, ప్రజలకు అన్నీ గుర్తుంటాయి.. వైసీపీకి వచ్చిన ఫలితాలే నిదర్శనమన్న చంద్రబాబు

www.mannamweb.com


టీడీపీ నాయకుల నుంచి కార్యకర్తల వరకు క్రమశిక్షణతో ఉండాలని ప్రజలు అన్నీ గుర్తు పెట్టుకుంటారని, ఎన్డీఏతోనే భవిష్యత్తు ఉంటుందనే భరోసా ప్రజలకు ఇవ్వాలని సీఎం చంద్రబాబు సూచించారు.టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమైన బాబు వైసీపీకి వచ్చిన ఫలితాలు టీడీపీ కూటమికి రాకుండా జాగ్రత్త పడాలన్నారు.
ఎన్డీఏకు వైసీపీ గతి పట్టకూడదని హెచ్చరించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు

ప్రజలు మౌనంగా ఉన్నంత మాత్రాన అన్ని భరిస్తున్నారని, అన్నీ గమనిస్తారనే అప్రమత్తతో నాయకులు వ్యవహరించాలని, మద్యం వ్యాపారంలో టీడీపీ నేతలు జోక్యం చేసుకుంటే సహించనని చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్రంలో గత ఐదేళ్ల వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయి ఎన్నికల్లో భారీ మెజార్టీని కట్టబెట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో నిర్వహించిన సమీక్షలో పార్టీ నాయకుల ఏ స్థాయి వారైనా క్రమశిక్షణతో ఉండాలని హెచ్చరించారు. అందరి పనితీరును సమీక్షిస్తున్నామని వైసీపీకి వచ్చిన పరిస్థితి రానివ్వకూడదన్నారు.

ఐదేళ్లలో వైసీపీ చేయని తప్పు లేదు, బెదిరించని విషయం లేదని ఎన్నికల్లో ఆ పార్టీకి 11 స్థానాలకు ఎందుకు పడిపోయిందో ఆలోచించుకోవాలన్నారు. వైసీపీ ఎన్ని సర్వేలు చేసినా, 175చోట్ల వస్తామని చెప్పినా ఎందుకు గెలవలేదని, ఆ రోజు వారు చేసిన పనులన్నీ ప్రజల మనసులో ఉన్నాయని చంద్రబాబు అన్నారు.
మద్యం వ్యాపారంలో వేలు పెట్టొద్దు…

ఏపీలో మాగుంట వంటి కుటుంబాలు ఎప్పటి నుంచో లిక్కర్ వ్యాపారంలో ఉన్నారని, రాజకీయాల్లోకి వచ్చాక కొత్తగా మద్యం వ్యాపారంలోకి రావాలనుకుంటే మాత్రం ఊరుకునేది లేదని, మద్యం వ్యాపారంలో జోక్యాన్ని ఊరుకోనని, అంతా క్రమశిక్షణతో ఉండాల్సిందేనని, అలాంటి వాటిని తాను ఊరుకోనని, అవతల వారి వద్ద వేల కోట్ల డబ్బులున్నాయని, డబ్బులు ఖర్చు పెట్టారని, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ లేకపోతే, ప్రజల్లో నమ్మకం లేకపోతే విజయం దక్కదన్నారు. మద్యం వ్యాపారంలో జోక్యం చేసుకుంటున్న వారిని ఉపేక్షించనని చంద్రబాబు హెచ్చరించారు.
వైసీపీ పరిస్థితి వద్దు…

వైసీపీ హయంలో ప్రజలు విధిలేక మాట్లాడలేదని, టీడీపీ కూడా నిలబడకపోతే ఎన్నికల్లో ఏమయ్యేదో తెలీదని.. టీడీపీ నిలబడి పోరాడింది. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 93శాతం విజయం సాధించామని చెప్పారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరు పనిచేయడం, కష్టపడటం, ఓట్లేయడం వాస్తవమేనని, అమెరికా నుంచి కూడా సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని వచ్చి ఎన్నికల పనిచేసి గెలిపించుకున్నామనే తృప్తితో వెళ్లారన్నారు. అయితే ప్రజలు తమను ఇబ్బంది పెడుతున్నారనే భావనకు గురైతే పార్టీకి ఇబ్బందులు తప్పవన్నారు.

వారిలా ప్రవర్తించొద్దు..రావణ కాష్టం చేయోద్దు

ఒక నాయకుడు జైలుకు వెళ్లారు, మరో నాయకుడు టార్చర్‌ అనుభవించారని కానీ అలాంటివి రిపీట్‌ చేస్తే రాష్ట్రం రావణ కాష్టం అవుతుందని చంద్రబాబు హెచ్చరించారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టమని, తప్పు చేశారని కక్ష సాధింపులకు పాల్పడితే ప్రజలు క్షమించరన్నారు. ప్రస్తుతం సమిష్టిగా పనిచేస్తే తప్ప ప్రజల అకాంక్షలు నేరవేర్చలేమన్నారు.
ఎవరు తప్పు చేసినా నాదే బాధ్యత..

ప్రతిఒక్కరు క్రమశిక్షణతో వ్యవహరించాలని, చిట్టచివర ఉండే ఉద్యోగి తప్పు చేసినా సిఎం మీదకు వస్తుందని, ఎన్డీఏలో ఉండే ఏ పార్టీ కార్యకర్త తప్పు చేసినా దానికి సీఎం బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. ఎవరు ఏమి చేసినా దానికి ముఖ్యమంత్రిదే బాధ్యత అవుతుందని, 95లో సీఎం అయినపుడు చాలా వేగంగా వెళ్లామని, అదే సమయంలో ప్రజలు అదే విధంగా ఆశీర్వదించారని, ప్రజలతో ప్రభుత్వం ప్రవర్తించే తీరు వల్లే ఎన్నికల్లో తిరిగి వచ్చే ఫలితాలు ఉంటాయని, అది అంతా గుర్తు పెట్టుకోవాలన్నారు.
వేవ్‌ను వాడుకోలేకపోయి ఓడారు..

తాను అనేక సర్వేలు చేసి, ఫలితాలను సమీక్షించుకుని ముందుకు వెళ్లామన్నారు. తాము తీసుకున్న నిర్ణయాలు కలిసొచ్చాయని, వేవ్‌ కూడా వచ్చిందన్నారు. కొన్ని నియోజక వర్గాల్లో కొందరు ఉపయోగించుకోలేకపోయారని, 25 పార్లమెంటు స్థానాలు గెలిచి ఉండేవారిమని, అసెంబ్లీల్లో రెండు మూడు తప్ప అన్ని స్థానాలు గెలిచి ఉండేవారిమన్నారు.

ప్రజలంతా ప్రభుత్వంపై ఆసక్తిగా చూస్తున్నారు.జాతీయ స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వంపై, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ఆసక్తికరంగా గమనిస్తున్నారని చంద్రబాబు చెప్పారు.2014లో టీడీపీ-బీజేపీ కలిసి పోటీ చేసి కేంద్ర, రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేశామని, ఈసారి రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చామని, పార్టీల మధ్య సమన్వయం, ప్రభుత్వం మీద అంచనాలు పెట్టుకున్న ప్రజల అకాంక్షలు నెరవేర్చాలన్నారు. ఐదేళ్లు అన్ని విధాలుగా నష్టపోయి, త్యాగాలు చేసి, బాధలకు గురైన కార్యకర్తలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
వ్యవస్థలు ధ్వంసం…

నాలుగోసారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆలోచిస్తే ఎప్పుడూ ఇన్ని అవరోధాలు చవి చూడలేదన్నారు. ఐదేళ్లలో రాష్ట్రం సర్వ నాశనం చేశారని, అధికారులకు పోస్టింగులు ఇస్తే తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, పరిమిత సంఖ్యలో ఆలిండియా సర్వీస్ అధికారులు ఉంటారని, వారికి పరిమితులు ఉంటాయని, అప్పట్లో పనిచేసిన వారిలో చాలామంది ప్రభుత్వానికి లొంగిపోయి, వ్యవస్థల్ని భ్రష్టుపట్టించారని చెప్పారు. ఏ వ్యవస్థ తన పని తాను చేసే స్థితిలో లేదన్నారు. ఏదో ఒక వ్యవస్థ బాగోకపోతే సరిచేయొచ్చని, వ్యవస్థలు ఏవి సక్రమంగా లేవన్నారు.

కేంద్రం ఇచ్చే డబ్బుల్ని ఎక్కడికక్కడ మళ్ళించేశారని, మనకు రావాల్సిన డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితులు లేవని, దేనికి వాడారో కూడా లెక్కలు లేకుండా వాడేశారని, ఫైనాన్స్‌ కమిషన్‌ నిధుల వినియోగంపై లెక్కలు లేవని, కేంద్రం పంపిన డబ్బులు, ఏ శాఖ, ఎందుకు ఖర్చు చేసిందో లెక్కలు లేవని చెప్పారు.

పంచాయితీరాజ్‌లో రూ990కోట్ల రుపాయలు మళ్ళించారని, దాని వల్ల రూ. 1200కోట్లు రావాల్సిన నిధులు ఆగిపోయాయని, నిధులు వచ్చే పరిస్థితి లేకుండా చేశారని చంద్రబాబు చెప్పారు. ప్రాంతీయ పార్టీల్లో దేశ రాజకీయాల్లో టీడీపీ క్రియాశీల పాత్ర పోషించిందని గుర్తు చేశారు. యునైటెడ్‌ ఫ్రంట్‌, ఎన్డీఏలలో కీలక పాత్ర పోషించింది. ఆరేళ్లు వాజ్‌పేయ్ ప్రభుత్వంలో మంత్రి పదవులు తీసుకోకుండా పనిచేశామని చెప్పారు.
వచ్చే ఎన్నికలకు బీజేపీ సిద్ధం అవుతోంది…

వచ్చే ఎన్నికల కోసం అప్పుడే బీజేపీ సన్నద్ధం అవుతోంది. హర్యానా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ఎన్డీఏ పక్షాల సమావేశాన్ని నిర్వహించారని చంద్రబాబు చెప్పారు.
అవకాశం దక్కని వారికి న్యాయం చేస్తాం…

ఐదేళ్లలో అందరూ అనేక బాధలకు గురయ్యారని, రాజకీయ నాయకులే కాకుండా సాధారణ ప్రజలు కూడా బాధలకు గురయ్యారని, తనను అరెస్ట్‌ చేసినపుడు పవన్ కళ్యాణ్ వచ్చినపుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని ప్రకటించారని చెప్పారు. చివర్లో బీజేపీ కూడా తమతో కలిసిందన్నారు.

ఎన్నికల పొత్తులో 31సీట్లను ఆ పార్టీలకు ఇచ్చామని చెప్పారు. పొలిటికల్ రీ ఇంజనీరింగ్‌‌కు వెళ్లి, టీడీపీకి అండగా ఉన్న బీసీ వర్గాలకు అగ్ర స్థానం ఇచ్చామని, ఇప్పటి వరకు ప్రాతినిథ్యం ఇవ్వని వర్గాలకు అవకాశం ఇచ్చామన్నారు. గెలుపే ధ్యేయంగా పనిచేయాలనే లక్ష్యంతో ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి అని నినాదం ఇచ్చినట్టు చెప్పారు.

ఎన్నికల పొత్తుల వల్ల పార్టీని నమ్ముకున్న వారికి కూడా సీట్లు ఇవ్వలేకపోయామని, వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చామని, ఒకరిద్దరు తప్ప అంతా సహకరించారని, వారిలో 65మంది కొత్త ఎమ్మెల్యేలు వచ్చారని, యువతరం, చదువుకున్న వాళ్లు పార్టీలోకి వచ్చారని చెప్పారు. 18మంది కొత్త మంత్రులు వచ్చారని, ఎమ్మెల్యేలు, ఎంపీలు 80మంది కొత్తవారు వచ్చారన్నారు.
సంక్రాంతికి రాష్ట్రమంతటా రోడ్ల మరమ్మతులు…

సంక్రాంతి పండుగ నాటికి రాష్ట్రమంతటా రోడ్ల మరమ్మతులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రూ.700కోట్లతో రోడ్ల నిర్మాణం, మరమ్మతులు పూర్తి చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.
అన్ని హామీలు నెరవేర్చాం…

ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తున్నామని చంద్రబాబు చెప్పారు. చెత్తపన్ను రద్దు, మత్స్యాకారుల కోసం 217జీవో రద్దు, స్వర్ణకారుల కార్పొరేషన్, గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో 10శాతం రిజర్వేషన్, అర్చకుల జీతాలు పెంపు, దేవాలయాల్లో నాయి బ్రాహ్మణులకు కనీస వేతనాలు, దీపదూప నైవేద్యాలకు 15వేలు, వేద విద్య అభ్యసించే వారికి రూ.6వేలు, చేనేత పరిశ్రమకు జిఎస్టీ రద్దు, రియింబర్స్‌మెంట్‌ వంటి నిర్ణయాలు అమలు చేస్తున్నామని చెప్పారు.

చేనేత కార్మికులకు రాయితీలు ఇస్తామని, ప్రభుత్వ జీవోలు ఆన్‌లైన్‌లో పెట్టామని, ఒకే రాజధానికి కట్టుబడి ఉందని చెప్పాము. మన రాజధాని అమరావతి అని చంద్రబాబు స్పష్టం చేశారు. కేంద్రం కూడా అమోదం తెలిపిందన్నారు. విశాఖ ఆర్ధిక రాజధాని, విశాఖలో ఎక్కువ ఉపాధికల్పిస్తున్నామన్నారు. కర్నూలులో ఓర్వకల్లు ఇండస్ట్రియల్ టౌన్‌ షిప్‌, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామన్నారు. పోలవరం ఫేజ్‌ 1 రెండే‌ళలలో పూర్తి చేస్తామని, ఫేజ్‌ 2కు ఇప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. భారీ వర్షాలతో 95శాతం చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. విజయవాడ వరదల్లో మునిగినా మిగిలిన చోట్ల ఇబ్బంది లేదన్నారు.