Amaravati: 2 నెలల్లో అమరావతికి స్వచ్ఛ శోభ

www.mannamweb.com


గత వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా చిట్టడవిని తలపిస్తున్న రాజధాని అమరావతికి కొత్త రూపు తెచ్చేందుకు ఎన్డీయే ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.

అమరావతి: గత వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా చిట్టడవిని తలపిస్తున్న రాజధాని అమరావతికి కొత్త రూపు తెచ్చేందుకు ఎన్డీయే ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రాజధాని వ్యాప్తంగా కంప చెట్ల తొలగింపునకు సీఆర్డీయే సిద్ధంకాగా, ఈ పనులకు ఎగ్జిక్యూటివ్‌ కమిటీ (ఈసీ) ఆమోదం తెలిపింది. త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరే ముందు జూన్‌లో ఐదు రోజుల పాటు ముఖ్యమైన 25 ప్రాంతాల్లో తాత్కాలికంగా ముళ్ల కంపలు తొలగించి, శుభ్రం చేశారు. 109 చ.కి.మీ. పరిధిలోని 673 ఎకరాల విస్తీర్ణంలో ఈ పనులు చేశారు. కరకట్ట రోడ్డు, అసెంబ్లీ, హైకోర్టు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్‌ అధికారుల నివాస సముదాయాల భవనాలకు వెళ్లే మార్గాలను శుభ్రం చేశారు. తాజాగా మంత్రి నారాయణ ఆదేశాలతో అమరావతి రూపురేఖలు మార్చేందుకు రూ.36.50 కోట్లతో పనులు చేపట్టాలని సీఆర్డీయే అంచనాలు సిద్ధం చేసింది. వారం రోజుల్లో టెండర్ల ప్రక్రియ కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. గుత్తేదారులు పనులు చేసేందుకు నెల రోజుల గడువు ఇవ్వనున్నారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో పరిశుభ్రత పనులు చేయనున్నారు. భూసమీకరణలో భూములిచ్చిన రైతులకు సీఆర్డీయే రిటర్నబుల్‌ ప్లాట్లను ఇచ్చింది. అయితే, ముళ్లకంపలు పెరిగిపోవడంతో చాలామందికి తమ ప్లాట్‌ ఎక్కడుందో తెలియని పరిస్థితి. ప్లాట్లను మార్కింగ్‌ చేసి చూపించాలని రైతులు ఎన్నిసార్లు కోరినా, నాటి వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు. సీఆర్డీయే చేపట్టే స్వచ్ఛ పనుల్లో భాగంగా ఎల్పీఎస్‌ లే ఔట్లలోనూ జంగిల్‌ క్లియరెన్స్‌ చేయనున్నారు.