నయం చేయలేని రోగం క్యాన్సర్. క్యాన్సర్ రోగుల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. మన దేశంలో కూడా క్యాన్సర్ మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
2019లో భారతదేశంలో దాదాపు 1.2 మిలియన్ల మంది క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. వారిలో 9.3 లక్షల మంది క్యాన్సర్ రోగులు మరణించారు. ఆ సంవత్సరం ఆసియాలో అత్యధిక క్యాన్సర్ మరణాలలో భారతదేశం రెండవ స్థానంలో ఉంది. భారతదేశంలో దాదాపు 32 రకాల క్యాన్సర్‌ల బారిన పడి, లక్షలాది మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. వాటిలో ఒకటి అన్నవాహిక క్యాన్సర్. మనదేశంలో ప్రతి సంవత్సరం 47 వేల మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారని, 42 వేల మంది మరణిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
ఇప్పటికీ ఈ వ్యాధితో ఎంతో మంది పోరాడుతున్నారు. క్యాన్సర్లలో అన్నవాహిక క్యాన్సర్ అరుదైనది. ప్రమాదకరమైనది. సాధారణంగా నోరు, గొంతు, అన్నవాహికలో ఏర్పడే ఫ్యూయల్ ట్యూమర్లు ఈ క్యాన్సర్‌గా రూపాంతరం చెందుతాయి. ముందుగానే అర్థం చేసుకోవడానికి మార్గం లేనప్పటికీ, గమనించవలసిన కొన్ని సాధారణ లక్షణాలు ఉన్నాయి. అవేంటంటే..
ఈ వ్యాధి ప్రారంభ దశలో ఆహారాన్ని మింగడం కష్టంగా ఉంటుంది. ద్రవ ఆహారాన్ని తినడం, మింగడం కూడా కష్టమవుతుంది. జలుబు చేసినా గొంతు నొప్పిగా ఉంటుంది. చాలా మంది ఈ లక్షణాలను సాధారణ జలుబుగా భావించి పెద్దగా పట్టించుకోరు. కానీ ఇది కూడా ఓ సంకేతమే.
ఈ వ్యాధి శరీరంలో వేళ్ళూనుకున్నప్పుడు, జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. ఛాతీలో మంట, తరచుగా త్రేనుపు, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆకస్మికంగా బరువు తగ్గవచ్చు. ఏ రకమైన ఆహారంపైనా విరక్తి కలిగించడం ఈ వ్యాధి లక్షణం. దీర్ఘకాలంగా దగ్గు రావడం ఈ వ్యాధి మరో లక్షణం. రాత్రి నిద్రలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గొంతు, ఛాతీ మధ్యలో నొప్పి వస్తుంది, ముఖ్యంగా ఆహారాన్ని మింగడం కష్టంగా ఉంటే, జాగ్రత్తగా ఉండాలి. వెంటనే వైద్య సలహా తీసుకోవాలి.
వికారం, అలసట, బలహీనత, తినేటప్పుడు ఉక్కిరిబిక్కిరి కావడం కూడా ఈ వ్యాధి లక్షణాలే. ఈ రకమైన క్యాన్సర్ ఫలితంగా తరచూ మలబద్ధకం లేదా అతిసారంతో బాధపడవచ్చు. వాయిస్ టోన్ కూడా మారవచ్చు. ఈ ప్రమాదకరమైన వ్యాధికి ఇప్పటివరకు వ్యాక్సిన్ కనుగొనబడలేదు. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యంగా ధూమపానం, మద్యపానం , పొగాకు వాడకం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. అలాగే ఊబకాయం వల్ల కూడా ఈ క్యాన్సర్ వస్తుంది. అతి వేడి టీ, కాఫీ తాగడం కూడా మంచిది కాదు.