మనందరికీ బీట్‌రూట్ తెలిసిందే. ఇది సమృద్ధిగా పోషకాలు, విటమిన్స్ కలిగిన ఒక దుంప జాతికి చెందిన కూరగాయ. దీని కూర తినడం లేదా, దీని రసం తాగడం వలన శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
ఈ బీట్‌రూట్ రసంలో అనేక నైట్రేట్లు, యాంటీ యాక్సిడెంట్లు, విటమిన్స్ ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని అందించడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చర్మ సౌందర్యానికి కూడా చాలా బాగా పని చేస్తాయి. అయితే ప్రతిరోజూ బీట్‌రూట్ జ్యూస్ తాగడం వలన ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బీట్‌రూట్ జ్యూస్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం:
బీట్‌రూట్‌లో ఉన్న నైట్రేట్లు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా గుండె జబ్బులు, స్ట్రోక్ వంటివి వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
మెదడు ఆరోగ్యం:
బీట్‌రూట్‌లోని నైట్రేట్లు మెదడుకు ఆక్సిజన్ సరఫరాను పెంచి జ్ఞాపకశక్తిని, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఈ రసం చిత్తవైకల్యం, అల్జీమర్స్ వంటి జ్ఞాన సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
ఫ్రీ రాడికల్స్ నుండి రక్షణ:
బీట్‌రూట్‌లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ Cలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుండి రక్షణ కల్పిస్తుంది. అలాగే వృద్ధాప్య ప్రభావాలను నియంత్రించి, అకాల వృద్ధాప్యాన్ని నివారించడంలో సహాయపడుతుంది. దీని కారణంగా యవ్వనంగా, ఆరోగ్యంగా, అందంగా కనిపిస్తుంటాము.
చర్మ ఆరోగ్యం
బీట్‌రూట్ రసం చర్మానికి మెరుపును ఇస్తుంది. వయసు పెరిగినా.. ఈ రసం చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి సహాయపడుతుంది. వేక్ ఫారెస్ట్ విశ్వవిద్యాలయ పరిశోధకులు చేసిన ఒక అధ్యయనంలో 55 సంవత్సరాలు.. అంతకంటే పైగా వయస్సు గల 26 మంది వ్యక్తులు ప్రతిరోజూ బీట్‌రూట్ రసం తాగడం ద్వారా మెదడు కనెక్టివిటీ మెరుగుపడిందని కనుగొన్నారు.
శక్తిని పెంచడం:
బీట్‌రూట్ రసం శరీర అలసట, కండరాల బలహీనతను తొలగించి శక్తిని పెంచుతుంది. ఇది కండరాలకు ఆక్సిజన్ ప్రవాహాన్ని మెరుగుపరిచి ఓర్పు పెంచుతుంది. ఈ రసం కాలేయాన్ని డీటాక్స్ చేస్తుంది. బీటాలైన్‌లు, యాంటీఆక్సిడెంట్ లక్షణాలతో ఇది కాలేయం నుండి విషాన్ని తొలగించడం, కొవ్వు కాలేయం నివారించడం, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే బీట్‌రూట్ రసం తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ కలిగి ఉంటుంది. ఇది కడుపును నిండుగా ఉంచుతుంది. ఇది జీవక్రియను పెంచి, బరువు తగ్గడంలో సహాయపడుతుంది.