Betavolt: వావ్.. కొత్త బ్యాటరీ..50 ఏళ్లకు సరిపడా చార్జింగ్! ఇక చార్జర్ల అవసరం లేనట్టేనా?

పునర్వినియోగ బ్యాటరీలకు చార్జింగ్ తప్పదు. కానీ 50 ఏళ్లకు సరిపడా విద్యుత్ అందించే బ్యాటరీలు అందుబాటులోకి వస్తే ఇక చార్జర్ల అవసరమే ఉండదు.


చైనాకు (China) చెందిన స్టార్టప్ కంపెనీ ‘బీటావోల్ట్’ (Betavolt) సరిగ్గా ఇలాంటి ఆవిష్కరణతోనే ముందుకొచ్చింది. అణుధార్మికత ఆధారంగా నడిచే అతి చిన్న న్యూక్లియర్ బ్యాటరీని (Nuclear battery with 50 year life) రూపొందించింది. కేవలం 63 ఐసోటోపులను ఓ చిన్న మాడ్యూల్‌గా కూర్చి దీన్ని రూపొందించింది. ప్రపంచంలో అణుశక్తితో నడిచే అతి చిన్న బ్యాటరీ ఇదేనని సంస్థ చెబుతోంది. ప్రస్తుతం ఈ బ్యాటరీపై ప్రయోగాలు జరుగుతున్నాయని, త్వరలో వాణిజ్య అవసరాలకు సరిపడా భారీ స్థాయిలో ఉత్పత్తి ప్రారంభిస్తామని బీటా వోల్ట్ చెప్పుకొచ్చింది.

అతి చిన్న బ్యాటరీ..

ఈ బ్యాటరీలో సైజు కేవలం 15 x 15 x 15 మిల్లీమీటర్లు. ఇందులో న్యూక్లియర్ ఐసోటోపులను సన్నని పొరలుగా అమర్చారు. ఐ ఈ బ్యాటరీ 3 వోల్టుల వద్ద 100 మైక్రోవాట్స్ విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. అయితే, బ్యాటరీ సామర్థ్యాన్ని 2025 కల్లా 1 వాట్ తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సంస్థ పేర్కొంది.

ఈ బ్యాటరీని ఎయిరోస్పేస్, ఏఐ ఎక్విప్మెంట్, మెడికల్ ఎక్విప్మెంట్, మైక్రోప్రాసెసర్లు, అడ్వాన్స్డ్ సెన్సర్లు, చిన్న డ్రోన్లు, మైక్రో రోబోట్స్‌లో శక్తి వనరుగా వినియోగించుకోవచ్చు. ఈ బ్యాటరీ విడుదల చేసే రేడియోధార్మికతతో ఎటువంటి అనారోగ్యం కలగదని, ఫలితంగా పేస్‌మేకర్లలో కూడా దీన్ని వాడుకోవచ్చని సంస్థ చెబుతోంది.

బ్యాటరీ పనిచేసేది ఇలా..

బ్యాటరీలోని ఐసోటోపులు రేడియోధార్మిక క్షీణతకు గురై శక్తిని విడుదల చేస్తాయి. ఈ శక్తి చివరగా విద్యుత్‌గా మారుతుంది. బ్యాటరీలోని ఐసోటోపులను వివిధ పొరలుగా అమర్చడంతో అగ్నిప్రమాదం కూడా ఉండవని బీటావోల్ట్ చెబుతోంది. మైనస్ 60 డిగ్రీల నుంచి 120 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కూడా తాము రూపొందించిన బ్యాటరీ పనిచేస్తుందని వెల్లడించింది.