రోజు మొత్తంలో అత్యంత ముఖ్యమైన భోజనం, బ్రేక్‌ఫాస్ట్ అని మనం చిన్నప్పటి నుంచీ వింటూ ఉన్నాం. కానీ బ్రేక్‌ఫాస్ట్‌ను స్కిప్ చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని తాజా అధ్యయనాలు చెప్తున్నాయి.
రాత్రి భోజనం తినడానికీ ఉదయం నిద్ర లేవడానికీ మధ్య ఉండే విరామ సమయంలో మన శరీరం రాత్రి తిన్న భోజనం ద్వారా అందిన క్యాలరీలను ఖర్చు చేసుకుంటుంది. అయితే అదే విరామ సమయాన్ని మరికొంత పొడిగిస్తే, ఖర్చు చేయడానికి సరిపడా క్యాలరీలు లేక మన శరీరం కొవ్వును కరిగించుకోవడం మొదలు పెడుతుంది. అయితే ఆ విరామ సమయంలో ఆకలితో కలిగే పదార్థ వ్యామోహాలు, ఎమోషనల్ ఈటింగ్‌లకు చెక్ పెడుతూ ఉండాలి. దీర్ఘ సమయాల పాటు శరీరానికి ఆహారం అందించకపోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
వ్యాధుల నుంచి రక్ష: టైప్2 మధుమేహం, గుండె జబ్బులు, వయసుతో సంబంధం ఉన్న న్యూరోడీజెనరేటివ్ డిజార్డర్లు, ఇన్‌ఫ్లమేటరీ బోవెల్ డిసీజ్, పలు రకాల కేన్సర్ల నుంచి రక్షణ పొందవచ్చు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌తో అధిక రక్తపోటు అదుపులోకొస్తుంది. విరామ సమయంలో గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది.
బరువు తగ్గొచ్చు: మెటబాలిజంను పెంచడం ద్వారా బరువు తగ్గడం మీ లక్ష్యమైతే, దీనికీ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తినకపోడానికీ ఎటువంటి సంబంధం ఉండదు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌తో మెటబాలిజం కిక్‌స్టార్ట్ అవుతుందనేది అపోహ మాత్రమే!
శక్తి పెరుగుతుంది: బ్రేక్‌ఫాస్ట్‌తో అందే క్యాలరీల మీద కోత విధిస్తే, నీరసం బదులుగా శక్తి సమకూరుతుంది. ఇందుకు కారణం శరీరం సురక్షితమైన కీటోజెనిక్ స్థితిలోకి ప్రవేశించడమే!
ఆటోఫజీ: కణాల వ్యర్థాలను శుభ్రం చేసే ప్రక్రియ ఆటోఫజీ. ఈ ప్రక్రియ జరగనప్పుడు పైబడే వయసుతో ముడిపడి ఉండే ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. ఆహారం తీసుకోనప్పుడు, ఆటోఫజీ వల్ల కణ శుభ్రత పెరుగుతుంది.
అప్రమత్తత: ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మానేయడం వల్ల మానసిక అప్రమత్తత, ఏకాగ్రతలు పెరుగుతాయి.
ఇన్సులిన్ సెన్సిటివిటీ: ఫాస్టింగ్ గ్లూకోజ్, ఫాస్టింగ్ ఇన్సులిన్, లెప్టిన్‌లు తగ్గి ఫలితంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా తగ్గుతుంది.
ఇన్‌ఫ్లమేషన్: మధుమేహం, మల్టిపుల్ స్క్లెరోసిస్, ఇన్‌ఫ్లమేటరీ బోవెల్ సిండ్రో మ్‌లతో ముడిపడి ఉండే ఇన్‌ఫ్లమేషన్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌తో తగ్గుతుంది.