ఏపీలో భానుడి భగభగలు.. నేడు 15 జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం?

ఏపీలో భానుడు నిజస్వరూపం చూపిస్తున్నాడు. నైరుతి (South west monsoon) రాకతో వేసవి ముగిసిందనుకునేలోపే.. అంత ఆనందమేంటి అన్నట్లు సెగలు కక్కుతున్నాడు. పగలే కాదు.. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరగడంతో పాటు.. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కొన్ని జిల్లాల్లో తీవ్రమైన ఎండలు మండిపోతుండగా..మరికొన్ని జిల్లాల్లో అడపా దడపా వర్షాలు కురుస్తున్నాయి. ఇక మంగళవారం రాష్ట్రంలో 15 జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.


మంగళవారం విజయనగరం,మన్యం, అల్లూరి,కాకినాడ,కోనసీమ,తూగో, పగో,ఏలూరు,కృష్ణా,ఎన్టీఆర్, గుంటూరు,బాపట్ల,పల్నాడు,ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉక్కపోతతో పాటు గరిష్టంగా41- 42.5°C వరకు ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం (జూన్ 11) గరిష్టంగా 40-41 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు అల్లూరి, అన్నమయ్య, చిత్తూరు తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

నిన్న (సోమవారం, జూన్ 9) ఇవాళ తూర్పుగోదావరి జిల్లా రంగంపేట,మన్యం జిల్లా గంగన్నదొరవలస, కృష్ణా జిల్లా పెనుమల్లి, ప్రకాశం జిల్లా మాలెపాడులో 40.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించింది. అత్యధికంగా బాపట్లలో 42, నరసాపురం 41, తుని 41, కావలి 41, నెల్లూరు 40.5, వైజాగ్ 40, మచిలీపట్నం 40, ఒంగోలు 40, కడప, 40, రాజమండ్రి 40, కాకినాడ 40, తిరుపతి 40, విజయవాడ 39, కర్నూల్ 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణశాఖ తెలిపింది. భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న క్రమంలో పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచించారు.

 

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.