పశ్చిమ వాయువ్యదిశగా కదులుతున్న వాయుగుండం.. దక్షిణ ఒడిస్సా, దక్షిణ ఛత్తీస్గడ్, విధర్భ మీదుగా రాగల 12 గంటల్లో ప్రయాణించి బలహీనపడనుంది. గడచిన 6 గంటల్లో 17 కిలోమీటర్ల వేగంతో కదిలిన వాయుగుండం..
జగదల్‌పూర్‌కు పశ్చిమంగా 40 కిలోమీటర్లు, మల్కనగిరికి 50 కిలోమీటర్లు, విశాఖకు 170 కిలోమీటర్లు, కళింగపట్నంకు 220 కిలోమీటర్లు, రామగుండంకి తూర్పున 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. వాయుగుండానికి అనుబంధంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో కోస్తాంద్రకు ఈ నెల 5 వరకు భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ అన్నారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలలు.. అత్యధికంగా 65 కిలోమీటర్లు గాలులు వీస్తాయంది. రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు ఆరెంజ్, 22 జిల్లాలకు ఎల్లో జారీ అయ్యింది. గంటకు 55 కి.మీ వేగంతో తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు అధికారులు. రెండ్రోజులుగా రాష్ట్రంలోని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. పలు చోట్ల వరద బీభత్సం నెలకొంది. భారీ వర్షాలు, వరదల కారణంగా 9 మంది మృతి చెందారు.
మరోవైపు వాయుగుండం ప్రభావంతో సోమవారం తెలంగాణలోని 8 జిల్లాలకు రెడ్ అలర్ట్, 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. గంటలకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సహాయక చర్యలకు ఆటంకం కలగకుండా ప్రజలు సహకరించాలని.. అవసరం ఉంటేనే బయటకు రావాలని అధికారులు కోరుతున్నారు. హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉండగా.. నగర వ్యాప్తంగా నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. ఇప్పటికే చిరుజల్లులు కురుస్తున్నాయి.