జేఈఈ మెయిన్‌ 2026 అభ్యర్ధులకు బిగ్ అలర్ట్.. పరీక్ష తేదీ మార్పు

భారత దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీ, ఐఐటీల్లో బీటెక్‌, బీఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఎగ్జామ్ “జేఈఈ మెయిన్‌”.


ఈ ఏడాది తొలి విడత పరీక్షలు మరో వారంలో జరగనున్నాయి. జనవరి 21 నుంచి 29 వరకు మొత్తం 6 రోజుల పాటు దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇప్పటికే ప్రకటించింది.

అయితే ఈ షెడ్యూల్‌లో భాగంగా జనవరి 23న పశ్చిమ బెంగాల్‌లో పరీక్ష నిర్వహించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా సరస్వతి పూజ ప్రభుత్వ సెలవు కావడంతో, విద్యార్థులు మరియు తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.

పూజ రోజు కూడా పరీక్ష ఉండటంతో మానసిక ఒత్తిడి, అసంతృప్తి విద్యార్థుల్లో కనిపించింది. ఈ విషయాన్ని పలు విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. సోషల్ మీడియా, లేఖల రూపంలోనూ NTAకు ఫిర్యాదులు చేరాయి. దీంతో పరిస్థితిని సమీక్షించిన NTA కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో JEE మెయిన్ 2026 (సెషన్ 1) పరీక్షల తేదీలో మార్పు చేస్తూ ఎన్టీయే ప్రకటన చేసింది.

జనవరి 23 పరీక్ష వాయిదా..

ఈ నేపథ్యంలో జనవరి 23న పశ్చిమ బెంగాల్‌లో జరగాల్సిన JEE మెయిన్‌ 2026 పరీక్షను NTA వాయిదా వేసింది. ఆ రోజున పరీక్ష రాయాల్సిన అభ్యర్థులకు మరో ప్రత్యేక తేదీని కేటాయించనున్నట్లు ప్రకటించింది. దీంతో సరస్వతి పూజ రోజున పశ్చిమ బెంగాల్ విద్యార్థులు జేఈఈ మెయిన్ పరీక్ష రాయాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈ నిర్ణయంపై విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే NTA సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లను విడుదల చేసింది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి సిటీ స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీని ద్వారా పరీక్ష జరిగే నగరం గురించి ముందుగానే తెలుసుకునే అవకాశం ఉంటుంది. పరీక్ష తేదీ మాత్రమే మారుతుందని, పరీక్ష స్థాయి, ప్రశ్నపత్రం కఠినత, మార్కింగ్ విధానం, నియమాలు అన్నీ ఒకే విధంగా ఉంటాయని NTA స్పష్టం చేసింది. ఏ విద్యార్థికీ నష్టం జరగకుండా, సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.

అడ్మిట్ కార్డులపై అప్‌డేట్

జనవరి 23 పరీక్షకు బదులుగా కేటాయించే కొత్త తేదీ వివరాలను త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటిస్తామని NTA తెలిపింది. అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్లను మాత్రమే నమ్మాలని, తప్పుడు సమాచారానికి లోనుకావద్దని సూచించింది. పరీక్ష తేదీలు సమీపిస్తున్న నేపథ్యంలో, జేఈఈ మెయిన్‌ అడ్మిట్ కార్డులు త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. సాధారణంగా పరీక్షకు 3 నుంచి 4 రోజుల ముందే హాల్ టిక్కెట్లు అందుబాటులోకి వస్తాయి. ఈ లెక్కన జనవరి 17 నుంచి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

సరస్వతి పూజ..

సరస్వతి పూజ పశ్చిమ బెంగాల్‌ ప్రజలకు కేవలం ఒక పండుగ మాత్రమే కాకుండా విద్య, సంస్కృతి, భావోద్వేగాలతో ముడిపడిన ముఖ్యమైన రోజు. ముఖ్యంగా విద్యార్థులు చదువుల తల్లి అయిన సరస్వతీ దేవిని పూజించి, తమ భవిష్యత్‌ లక్ష్యాల కోసం ఆశీర్వాదం తీసుకునే సంప్రదాయం ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.