Big Breaking: మరోసారి జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్‌ దోవల్

www.mannamweb.com


కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. అయితే జాతీయ భద్రతా సలహాదారు (NSA)గా అజిత్‌ దోవల్‌ను మరోసారి నియమించారు. గతంలో రెండుసార్లు జాతీయ భద్రతా సలహాదారుగా చేసిన ఆయన..

మూడోసారి కూడా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నెల 10 నుంచి ఆయన నియామకం అమల్లోకి రానున్నట్లు క్యాబినేట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ వెల్లడించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే డా.పీకే మిశ్రా ప్రధాని మోదీకి ప్రిన్సిపల్ సెక్రటరీగా కొనసాగనున్నారు. మరోవైపు ప్రధాని మోదీకి సలహాదారులుగా అమిత్ ఖేర్‌, తరుణ్ కపూర్‌లను నియమించారు. రెండేళ్ల కాలపరిమిత కోసం ఈ ఇద్దరిని నియమించారు.

అజిత్‌ దోవల్ కేరళ కేడర్‌కు చెందిన రిటైర్డ్‌ ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారి. అలాగే మాజీ ఇండియన్ ఇంటెలిజెన్స్ అండ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి. 1945లో ఉత్తరాఖండ్‌లో జన్మించిన ఆయన భారత్‌లో అత్యంత పిన్న వయస్కుడైన పోలీస్ అధికారిగా కీర్తి చక్ర మెరిటోరియస్ సర్వీస్, సైనిక సిబ్బందికి గాలంటరీ అవార్డును అందుకున్నారు. 2016లో సర్జికల్ స్ట్రైక్, 2019లో బాలాకోట్ వైమానిక దాడులు అజిత్ దోవల్ పర్యవేక్షణలోనే జరిగాయి. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాటును పరిష్కరించేందుకు కూడా చర్యలు తీసుకున్నారు.

అజిత్ దోవల్ విషయానికి వస్తే.. ఆయన ఏడేళ్లపాటు పాకిస్థాన్‌లో రహస్య కార్యకర్తగా పనిచేసినట్లు టాక్ ఉంది. అలాగే పలు మిలిటెంట్ గ్రూపులపై నిఘా సేకరిస్తున్నట్లు సమాచారం. సీక్రెట్ ఏజెంట్‌గా ఒక ఏడాది పనిచేసిన ఆయన.. ఆ తర్వాత ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌లో ఆరేళ్లపాటు పనిచేశారు. అంతేకాదు 1984లో ఖలిస్తానీ ఖలిస్థానీ మిలిటెన్సీని ఉక్కిరిబిక్కిరి చేయడానికి ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ కోసం నిఘాను సేకరించడంలో దోవల్ కీలక పాత్ర పోషించారు. అజిత్ దోవల్ తన కెరీర్‌లో ఎక్కువ భాగం ఇంటెలిజెన్స్ బ్యూరో (IB)లో యాక్టివ్ ఫీల్డ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా గడిపారు. 2009లో పదవీ విరమణ చేసిన తర్వాత, దోవల్ వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వ్యవస్థాపక డైరెక్టర్ అయ్యారు. ఆ తర్వాత 2014, 2019లో మోదీ హయాంలో రెండుసార్లు జాతీయ భద్రత సలహాదారుడిగా నియమించబడి సేవలు అందించారు. ఇప్పుడు మూడోసారి కూడా ఆయనకే ఈ కీలక బాధ్యతలు అప్పగించారు.