కేంద్ర కేబినెట్ నేడు ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశం అనంతరం కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్(Ashwini Viashnav) కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు.
ఇందులో రైతుల కోసం, అభివృద్ధి కోసం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. 2025-26 ఖరీఫ్ సీజన్‌లో 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర(MSP) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ MSP కోసం రూ.2 లక్షల 70 వేల కోట్లు కేంద్రం కేటాయించినట్టు పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో రైతులు పండించిన పంటలకు మంచి ధర వస్తుందని, వారి ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. రైతు సంక్షేమం కోసం ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్(Interest Subsidy Scheme)ను కూడా ఆమోదించారు.
దీని ద్వారా రైతులు తీసుకునే రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించి, వారిపై ఆర్థిక భారం తగ్గించేలా చర్యలు తీసుకోనున్నారు. అలాగే, ముఖ్యమైన మూడు మార్గాలలో 4-లేన్ల రహదారుల(4-Lane Highways) నిర్మాణానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. మహారాష్ట్రలోని వార్డా-బల్లార్షా(Warda-Ballarsha), మధ్యప్రదేశ్‌లోని రత్లాం-నాగ్డా(Ratlam-Nagda), ఆంధ్రప్రదేశ్(AP)లోని బద్వేల్-నెల్లూరు(Badwel-Nellore) మధ్య 4-లేన్ల రహదారులు నిర్మిస్తారు. ఈ రహదారులు రవాణా సౌలభ్యం పెంచి, ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తాయని అశ్వినీ వైష్ణవ్ తెలియజేశారు. ఈ నిర్ణయాలు రైతులకు, సామాన్య ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తాయని కేంద్రం భావిస్తోంది.
14 రకాల పంటలకు కనీస మద్దతు ధర వివరాలు ఇలా ఉన్నాయి:
వరి: క్వింటాల్‌కు రూ.69 పెరిగి, ధర రూ.2,369కి చేరింది.
జొన్నలు: రూ.328 పెరిగి, క్వింటాల్ ధర రూ.3,699 అయింది.
సజ్జలు: రూ.150 పెరిగి, ధర రూ.2,775 అయింది.
రాగులు: రూ.596 పెరిగి, ధర రూ.4,886 అయింది.
వేరుశెనగ: రూ.480 పెరిగి, క్వింటాల్ ధర రూ.7,263 అయింది.
మొక్కజొన్న: రూ.175 పెరిగి, ధర రూ.2,400 అయింది.
కందిపప్పు: రూ.450 పెరిగి, ధర రూ.8,000 అయింది.
పెసర్లు: రూ.86 పెరిగి, ధర రూ.8,768 అయింది.
మినుములు: రూ.400 పెరిగి, ధర రూ.7,800 అయింది.
పొద్దుతిరుగుడు: రూ.441 పెరిగి, ధర రూ.7,721 అయింది.
సోయాబీన్: రూ.436 పెరిగి, ధర రూ.5,328 అయింది.
కుసుములు: రూ.579 పెరిగి, ధర రూ.9,846 అయింది.
ఒలిసెలు (నైజర్ సీడ్): రూ.820 పెరిగి, ధర రూ.9,537 అయింది.
పత్తి: క్వింటాల్‌కు రూ.589 పెరిగి, ధర రూ.8,110 (మంచి క్వాలిటీ) అయింది.
































