బెజవాడను బుడమేరు ముంచేసింది.. గత వారం రోజులుగా విజయవాడ పట్టణం వరద బీభత్సంతో అస్తవ్యస్థంగా మారింది. వరద ముంపుతో బాధితులు సర్వస్వం కోల్పోయి రోడ్డునపడ్డారు. వరద బాధిత కుటుంబాలకు సాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.. ఈ క్రమంలో అనేక మంది ముందుకు వచ్చారు. వీరిలో ఎంతో మంది సినీ ప్రముఖులతో పాటు, సంపన్నులు, వ్యాపార, పారిశ్రామిక వేత్తలు కూడా ఉన్నారు. కోట్ల రూపాయల సాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు చిన్నారుల అందించిన వరద సహాయం సీఎం చంద్రబాబును కదిలించింది. చిట్టిచేతులు పెద్ద సాయం చేశాయంటూ అందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. ఆ చిన్నారుల్ని ఎంతగానో ప్రశంసించారు సీఎం చంద్రబాబు.
ప్రస్తుతం చంద్రబాబు షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిని కోట్ చేసిన చంద్రబాబు.. ఇది తనను ఎంతో మురిసిపోయేలా చేసిందని వ్యాఖ్యానించారు. పశ్చిమ గోదావరి జిల్లా, పెంటపాడుమండలం పడమర విప్పర్రు గ్రామానికి చెందిన ఓ స్కూల్ విద్యార్థులు విజయవాడ వరద బాధితులకు సాయం అందించారు. ఇంట్లో తల్లిదండ్రులు వారికి ఇచ్చిన పాకెట్ మనీని దాచుకున్న పిల్లలు వరద సాయం కోసం అందించారంటూ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
చిన్నారుల మంచి మనసుకు బాబు చలించిపోయారు. ఈ సంఘటన తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు సీఎం చంద్రబాబు. విద్యార్థులకు ఉన్నత విలువలు నేర్పుతున్న స్కూల్ యాజమాన్యాన్ని కూడా చంద్రబాబు అభినందించారు.