విశాఖకు ఇన్ఫోసిస్ బిగ్ న్యూస్..! త్వరలో కీలక ప్రకటన

దేశీయ ఐటీ దిగ్గజం, అమెరికా సహా 50 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న సాఫ్ట్ పేర్ సంస్థ ఇన్ఫోసిస్ ఏపీ ఐటీ రాజధానిగా మారుతున్న విశాఖపట్నానికి బిగ్ న్యూస్ చెప్పింది.


ఇప్పటికే విశాఖలో తాత్కాలిక క్యాంపస్ ద్వారా తమ కార్యకలాపాలు సాగిస్తున్న ఇన్ఫోసిస్ ను ఇక్కడే శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం ఎప్పటి నుంచో కోరుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్ కు ఇన్ఫోసిస్ అంగీకరించింది.

ఇన్ఫోసిస్ విశాఖలో శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేసుకుంటే తగిన రాయితీలు ఇచ్చేందుకు సిద్దమని కూటమి సర్కార్ ఆఫర్ చేసింది. ఈ మేరకు ఇరువర్గాల మధ్య కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. అదే సమయంలో గూగుల్ డేటా సెంటర్ వస్తుండటం, తాజాగా రిలయన్స్ డేటా సెంటర్ ఏర్పాటుకు కూడా ప్రతిపాదనలు రావడంతో ఇదే అదనుగా ఇన్ఫోసిస్ కూడా విశాఖలో పూర్తిస్దాయి క్యాంపస్ ఏర్పాటు చేసుకునేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది.

ఇన్ఫోసిస్ శాశ్వత క్యాంపస్ ఏర్పాటుకు వీలుగా నగరంలోని ఎండాడ వద్ద 20 ఎకరాలు కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అయితే ఇతర రాయితీలపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇవి పూర్తి కాగానే బహుశా ఈ నెలలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెప్తున్నారు. దీన్ని పరోక్షంగ ప్రస్తావిస్తూ ఐటీ మంత్రి నారా లోకేష్ తాజాగా విశాఖ సిద్ధంగా ఉండు, ఈ నెలలో ప్రపంచ ఛాంపియన్లు రాబోతున్నారంటూ ట్వీట్ కూడా చేశారు. వచ్చేది ఎవరో ఊహించగలరా అంటూ ఓ ప్రశ్న కూడా సంధించారు.

విశాఖలో ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం జరిగింది. అలాగే తాజాగా కాగ్నిజెంట్ తాత్కాలిక క్యాంపస్ లో కార్యకలాపాలు ప్రారంభించండంతో పాటు శాశ్వత క్యాంపస్ ఏర్పాటుకు కూడా భూమిపూజ చేసుకుంది. అలాగే రిలయన్స్-బ్రూక్ ఫీల్డ్ డేటా సెంటర్ ఏర్పాటుకు కూడా ప్రతిపాదన వచ్చింది. అలాగే నగరంలోని మిలీనియం టవర్స్ లో టీసీఎస్ శాశ్వత క్యాంపస్ ఏర్పాటు పనులు కూడా పూర్తి కావచ్చాయి. అలాగే మరో ఐటీ సంస్థ యాక్సెంచర్ కూడా నగరంలో క్యాంపస్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.