అమరావతి రాజధానులు మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్న చంద్రబాబు సర్కార్ కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. అమరావతి రాజధాని నిర్మాణం కోసం గతంలో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ సహా వివిధ సంస్థల నుంచి తీసుకునే రూ.15 వేల కోట్ల రుణాలకు గ్యారంటీ ఇచ్చిన కేంద్రం.. ఇందులో భాగంగా ఇవాళ తొలి విడతగా నిధులు విడుదల చేసింది. దీంతో అమరావతి పనుల పునఃప్రారంభానికి ప్రధాని వస్తున్న వేళ ఏపీ ప్రభుత్వానికి ఊరట దక్కింది.
ఏపీలో అమరావతి రాజధాని అభివృద్ధి ప్రాజెక్టుకు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం తొలి విడత నిధులు విడుదల చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి రూ.4,285 కోట్ల నిధులు విడుదల చేసినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రపంచ బ్యాంకు నుండి మొదటి విడతగా 205 మిలియన్ డాలర్లను అందుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు రూ.4285 కోట్ల నిధుల్ని విడుదల చేసింది.
అమరావతి రాజధాని నగరంలో ఫేజ్1 అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు కలిసి 1600 మిలియన్ డాలర్లు (రూ.13,600 కోట్లు) నిధులిచ్చేందుకు గతంలోనే అంగీకరించాయి. ఇందులో ఒక్కో బ్యాంక్ 800 మిలియన్ డాలర్ల మేర నిధులు సమకూర్చడానికి అంగీకరించాయి. అయితే అమరావతి తొలి దశ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలను కేటాయించగా.. మరో రూ.1,400 కోట్లను తమ నిధుల నుంచి కేంద్రం కేటాయిస్తోంది.
ప్రపంచ బ్యాంకు అందించిన వివరాల ప్రకారం అమరావతి రాజధాని ప్రాజెక్ట్ ఈ ఏడాది జనవరి 22న అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా తొలి విడతగా 205 మిలియన్ డాలర్ల నిధుల్ని గత నెలలో విడుదల చేశారు. దీంతో కేంద్రం కూడా ఇందులో నుంచి అమరావతి రాజధానికి ఈ నిధులు విడుదల చేసింది. దీంతో అమరావతిలో నిర్మాణాల పునఃప్రారంభానికి ఊతం లభించబోతోంది.