రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి (alliance)కి అఖండ విజయాన్ని కట్టబెట్టారు. మరోవైపు వైసీపీ (YSRCP) కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమై అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను సైతం కోల్పోయింది.
ఈ క్రమంలోనే పార్టీలోని నాయకుల్లో అంతర్మథనం మొదలైంది. అధికారంలో ఉన్న నాడు తమను పట్టించుకోలేదని మాజీ మంత్రులు, ఎంపీలు, ముఖ్య నాయకులు సైతం పార్టీ నుంచి ఒక్కొక్కరుగా వైదొలుగుతున్నారు. తాజాగా, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను (Samineni Udayabhanu)వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు.
ఈ మేరకు ఆయన ఈనెల 22న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)సమక్షంలో జనసేన (Janasena) పార్టీలో చేరబోతున్నట్లుగా వెల్లడించారు. అయితే, తాను పార్టీ మారే విషయాన్ని ఇప్పటికే తన అనుచరులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలకు సమాచారం అందజేసినట్లు ఉదయభాను అన్నారు. అదేవిధంగా శుక్రవారం జగ్గయ్యపేట (Jaggaiah pet)లో నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో ఓ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అదే రోజు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) కూడా జనసేన పార్టీలో చేరబోతున్నట్లుగా సమాచారం.