టీటీడీలో కొత్త పాలక వర్గ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. భక్తులకు దర్శనంతో పాటుగా వసతుల అంశంలోనూ మార్పులు తెస్తోంది. క్యూ లైన్లలో నిరీక్షణ సమయం తగ్గించి వేగంగా శ్రీవారి దర్శనం అయ్యేలా కార్యాచరణ ప్రారంభించింది.
ఇక, ఫిబ్రవరి నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఈ రోజు ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. ఇక నుంచి అన్నదానం ట్రస్టుకు విరాళం ఇచ్చేందుకు కొత్తగా కియోస్క్ మిషన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
అన్నప్రసాదం ట్రస్టుకు నిధులు
టీటీడీ నిర్వహిస్తున్న ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు విరాళం ఇచ్చేందుకు తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో కియోస్క్ మిషన్ ను టీటీడీ ఏర్పాటు చేసింది. ఈ మిషన్ ను టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ప్రారంభించారు. ఈ మిషన్ ను కెనరా బ్యాంకు టీటీడీకి విరాళంగా అందించింది. ఈ మిషన్ల ద్వారా భక్తులు ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు సులభతరంగా విరాళం అందిచవచ్చు. రూ.1 నుండి రూ.99,999 వరకు తమకు తోచిన మొత్తాన్ని భక్తులు కియోస్క్ మిషన్ లోని క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేసి యూపీఐ ద్వారా విరాళం ఇవ్వవచ్చు. భవిష్యత్తులో మరిన్ని కియోస్క్ మిషన్లను ఏర్పాటు చేస్తామని వెంకయ్య చౌదరి తెలియజేశారు.
ఏఈవో తనిఖీలు
ఇక, వెంకయ్య చౌదరి తిరుమలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంబీ రోడ్డులోని అన్నపూర్ణ హోటల్ భవనాన్ని పరిశీలించారు. అనంతరం దుకాణాల లైసెన్సులను స్వయంగా తనిఖీ చేశారు. ఒక టీ దుకాణంలో టీ సేవించి ధరలను అడిగి తెలుసుకున్నారు.
ఒకే లైసెన్సుతో రెండు మూడు ప్రాంతాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, లైసెన్సులను డిజిటలైజేషన్ చేసి దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. తిరుమలలో అనధికారికంగా వ్యాపారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల ఫిబ్రవరి నెల కోటాను టీటీడీ గురువారం విడుదల చేయనుంది.
సేవా, సేవల టోకెన్లు
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లను గురువారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్ ద్వారా విడుదల చేయనున్నారు. అదే విధంగా శ్రీవారి ఆలయంలో అంగ ప్రదక్షిణ టికెట్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారి కోసం ప్రత్యేక దర్శన టోకెన్లు విడుదల చేయనున్నారు. 24వ తేదీ ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్నట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు.