కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్డేట్. పెన్షన్స్, పెన్షనర్ల సంక్షేమ విభాగం (DoPPW) తాజాగా ఓ మెమోరండం జారీ చేసింది. పదవీ విరమణ పొందనున్న ప్రభుత్వ ఉద్యోగులకు జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) చెల్లింపులపై క్లారిటీ ఇచ్చింది. జీపీఎఫ్ సెటిల్మెంట్ రిటైర్మెంట్ అయిన వెంటనే కుదరక జాప్యం జరిగినట్లయితే వడ్డీ చెల్లిస్తారా? లేదా? అనే అంశంపై ప్రశ్నలు ఎదురవుతున్న క్రమంలో ఈ మేరకు క్లారిటీ ఇచ్చింది. ఉద్యోగ విమరణ చేయబోతున్న వారందరూ ఈ విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలి.
‘రిటైర్మెంట్ తర్వాత జీపీఎఫ్ చెల్లింపులు జాప్యం జరిగినట్లయితే వడ్డీ చెల్లించాలా? వద్దా? అనే విషయంపై క్లారిటీ కోసం ఇటీవల మాకు కొన్ని సూచనలు వచ్చాయి. ‘ అని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ తన మెమోరండంలో పేర్కొంది. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు అందించిన గత వివరణలను మెమోరండంలో పేర్కొంది. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎఫ్ తుది మొత్తాన్ని సకాలంలో చెల్లించడం చాలా కీలకమని నొక్కి చెప్పింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు జనవరి, 2017లో జారీ చేసిన మెమోరండంలో వివరించడం జరిగిందని స్పష్టం చేసింది.
జనరల్ ప్రావిడెంట్ ఫండ్ రూల్స్ 1960లోని రూల్ 34 ప్రకారం.. రిటైర్డ్ ఉద్యోగులకు సరైన సమయానికి జీపీఎఫ్ సెటిల్మెంట్ పూర్తి చేయడం అనేది అకౌంట్స్ ఆఫీర్ బాధ్యత. ఈ చెల్లింపులను సమర్థవంతంగా ప్రాసెస్ చేయాల్సిన అధికారుల బాధ్యతను ఇది నొక్కి చెబుతోంది. జీపీఎఫ్ అకౌంట్ అనేది ప్రభుత్వ ఉద్యోగి వ్యక్తిగత ప్రాపర్టీగా తాజాగా విడుదల చేసిన మెమోరండంలో పేర్కొంది కేంద్రం. ఈ నేపథ్యంలో పెనాల్టీలు, ఇతర సమస్యలు సకాలంలో జీపీఎఫ్ చెల్లింపులపై ప్రభావం చూపకూడదని తెలిపింది. రూల్ 11(4) ప్రకారం రిటైర్మెంట్ సమయంలో జీపీఎఫ్ బ్యాలెన్స్ చెల్లించనట్లియతే.. రిటైర్మెంట్ తేదీ తర్వాత నుంచి వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని చెబుతోంది.
ఉద్యోగులు, తమ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ ఇందులో పొదుపు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగ విరమణ తర్వాత మాత్రమే కాదు, ఉద్యోగంలో ఉన్నప్పుడు ఏదైన అత్యవసరం ఏర్పడిన సందర్భంలోనూ ఈ జీపీఎఫ్ ఆర్థికంగా భరోసా కల్పిస్తుంది. పదవీ విరమణ తర్వాత స్థిరమైన ఆదాయం అందించాలనే ప్రాథమిక లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు.