ఆంధ్రప్రదేశ్‌లో టిడ్కో ఇళ్ల లబ్దిదారులకు గుడ్ న్యూస్… గత ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్లకు సరిపడ నిధులు మంజూరు చేయకపోవడంతో చాలా చోట్ల నిర్మాణం పూర్తి కాలేదనే ఆరోపణలు ఉన్నాయి.
అయితే కూటమి ప్రభుత్వం టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్దిదారులకు అందించేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే ఏపీ టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్ బుధవారం ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా నెల్లిమర్ల నియోజకవర్గంలోని ఎన్టీఆర్ నగర్ టిడ్కో కాలనీలు సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి టిడ్కో ఇళ్ల పురోగతిని పరిశీలించారు. టిడ్కో ఇళ్లను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుదుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని అజయ్ కుమార్ చెప్పారు.
టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు కేంద్రం నుంచి వచ్చిన నిధులను కూడా గత ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆరోపించారు. వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్నిగత వైసీపీ సర్కారు దుర్వనియోగం చేసిందని ఆరోపించారు. ఇప్పుడు టీడీపీ,జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం టిడ్కో ఇళ్లను పూర్తి చేసి పేదలకు అందించేందుకు కార్యచరణ ప్రణాళికతో ముందుకు సాగుతుందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం చర్యల వల్లే టిడ్కో గృహ సముదాయాల్లో సమస్యలు నెలకొన్నాయని అజయ్ కుమార్ చెప్పారు. రూపాయికే ఇల్లు ఇస్తామని వైసీపీ మాట తప్పిందని విమర్శించారు.
ఈ విషయంలో ప్రభుత్వం చాలా ఉదారంగా వ్యవహారించి లబ్ధిదారులకు ఇప్పటికే అరకొరగా పూర్తయిన ఇళ్లను సంపూర్ణంగా పూర్తి చేస్తుందని చెప్పారు. అంతేకాకుండా టిడ్కో సముదాయాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే పనులను వేగవంతం చేస్తామని అజయ్ కుమార్ తెలిపారు. వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి పెండింగ్ టిడ్కో ఇళ్లలో గృహ ప్రవేశాలకు అవకాశం కల్పిస్తామని తెలిపారు.
ఇదిలాఉంటే, మంగళవారం రోజున గోదావరి జిల్లాల్లో పర్యటించిన ఏపీ మంత్రి నారాయణ మాట్లాడుతూ… రాష్ట్రంలో టిడ్కో ఇళ్లు పూర్తి కావాలంటే రూ.1,000 కోట్లు అవసరమని తెలిపారు. టిడ్కో ఇళ్ల నిర్మాణం విషయంలో గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. వీలైనంత త్వరగా లబ్ధిదారులకు ఇళ్లు పూర్తిచేసి ఇస్తామని తెలిపారు.
































