ఇండియన్స్ పై బిల్ గేట్స్ కీలక వ్యాఖ్యలు.. చదవటం మిస్ కావొద్దు

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు.. ప్రపంచ కుబేరుల్లో ఒకరు.. ప్రపంచంలో దానగుణం ఎక్కువగా ఉన్న వాళ్లలో ఒకరుగా ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి బిల్ గేట్స్. తాజాగా ఆయనో పాడ్ కాస్ట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై తన అభిప్రాయాల్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా భారతీయులను ఉద్దేశించి ఆయన పలు అంశాల్ని ప్రస్తావించారు. కీలక సూచనలు చేశారు. భారత యువత కచ్ఛితంగా పాటించాల్సిన కొన్ని అంశాల గురించి ఆయన చేసిన సూచనల్ని పక్కాగా పాటించాలనే చెప్పాలి. ఇంతకూ బిల్ గేట్స్ ఏం చెప్పారు? అన్న విషయంలోకి వెళితే..


ప్రపంచంలోనే భారత్ టాలెంట్ హబ్ గా ఎందుకు మారుతుంది? అంటూ బిల్ గేట్స్ ను ప్రశ్నించగా.. ఆయన స్పందిస్తూ.. భారతీయులు గొప్ప ప్రతిభావంతులుగా పేర్కొన్నారు. సమస్యల్ని సులభంగా పరిష్కరిస్తారన్నారు. వారి ఆవిష్కరణల్ని చూస్తే ఈ విషయం అర్థమవుతుందన్న ఆయన.. ‘డిజిటల్ రంగంలోనూ భారత్ దూసుకెళుతోంది. ఆధార్ సంబంధిత కార్యక్రమాలే దీనికి నిదర్శనం’ అని పేర్కొన్నారు. భారత యువత ప్రయాణాలుచేయాలన్న సూచన చేశారు. యువత ప్రయాణాలు చేయటం ద్వారా వివిధ సంస్క్రతులు.. ఆర్థిక పరిస్థితులు.. సామాజిక వాస్తవాలను దగ్గరగా చూడగలుగుతారన్నారు. ఇది వారిలో సానుభూతి.. అవగాహన.. బాధ్యతను పెంపొందిస్తుందన్నారు. ప్రత్యేకించి అభివ్రద్ధి చెందుతున్న దేశమైన భారత్ లో యువత అవకాశాలు అసమానలతో ఉంటాయన్నారు.

అందుకే ఈ విషయాల్ని వారు అర్థం చేసుకుంటే వారు జీవితంలో.. సమాజంలో సానుకూల మార్పులు తీసుకురావటానికి దోహదపడతారన్నారు. భారత్ లో జరుగుతున్న వేగవంతమైన ఆర్థిక పురోగతి.. సాంకేతిక అభివ్రద్ధిని ప్రశంసిస్తూ.. మరో కీలక వ్యాఖ్య చేశారు. ఈ పురోగతి సమాజంలోని అన్ని వర్గాలకు సమానంగా అందుబాటులో లేదన్నారు. యువత ఆ అంశాల్ని గుర్తించటం కీలకమని చెబుతూ.. ‘‘వివిధ ప్రాంతాల్లో ప్రయాణాలు సాగించటం ద్వారా యువత తమ కంటే తక్కువ అవకాశాలు కలిగిన వారి జీవితాలను చూసి.. వారికి సహాయం చేయటానికి లేదంటే సమాజంలో మార్పు తీసుకురావటానికి ప్రేరణ పొందుతారు’’ అని పేర్కొన్నారు. భారత్ గురించి బిల్ గేట్స్ చేసిన ఈ వ్యాఖ్యల్ని యువత తూచా తప్పకుండా పాటిస్తే.. రానున్న రెండు దశాబ్దాల్లో దేశం రూపు రేఖలు చాలా మేరకు మారతాయని మాత్రం చెప్పక తప్పదు.