Bitcoin scam case: బిట్ కాయిన్ ఇష్యూ, బుక్కైన శిల్పాశెట్టి దంపతులు, ఆస్తుల సీజ్

Bitcoin scam case: బాలీవుడ్ నటి శిల్పాశెట్టికి కష్టాలు తప్పడం లేదు. బిట్ కాయిన్ పోంజీ కేసు ఈ దంపతులను వెంటాడుతోంది. ఏడేళ్లుగా ఈ కేసు సాగుతూ వస్తోంది. ఇందులోభాగంగా శిల్పా దంపతులకు చెందిన దాదాపు 98 కోట్ల రూపాయల ఆస్తులను సీజ్ చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. ముంబైలో జుహూ ఏరియాలో ప్లాట్‌, పూణెలోని ఓ బంగ్లా సహా మొత్తం 98 కోట్ల రూపాయల విలువైన స్థిర, చరాస్తులను అటాచ్ చేస్తూ నోటీసులు ఇచ్చింది ఈడీ.


ముంబైకి చెందిన వేరియబుల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 2017లో బిట్ కాయిన్ పోంజీ స్కీమ్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో పెట్టుబడిపెడితే నెలకు 10శాతం లాభాలు వస్తాయన్నది అందులోని లోగుట్టు. దీని ద్వారా మల్టీలెవన్ మార్కెటింగ్ పద్దతిలో అమాయకుల నుంచి దాదాపు 6 వేల 600 కోట్ల రూపాయల వరకు వసూలు చేశారు శిల్పాశెట్టి దంపతులు. మొదట్లో లాభాలు వచ్చినట్టు చూపించారు. చివరకు అసలు మోసం బయటపడింది. సంస్థ ప్రమోటర్లపై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.
ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేయగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీనికి మాస్టర్ మైండ్ అమిత్ భరద్వాజ్ నుంచి శిల్పా భర్త రాజ్‌కుంద్రా 285 బిట్ కాయిన్స్ తీసుకున్నట్లు ఈడీ పేర్కొంది. అంతేకాదు ఉక్రెయిన్‌‌లో ఓ మైనింగ్ ఫామ్‌ను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసినట్టు ప్రస్తావించింది. ప్రస్తుత ఆయన వద్దనున్న బిట్ కాయిన్స్ విలువ మార్కెట్ ప్రకారం 150 కోట్ల రూపాయలుగా పేర్కొంది. ఈ క్రమంలో ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ.

ఈ కేసు మాత్రమే కాదు శిల్ప భర్త రాజ్‌కుంద్రాపై మరో కేసు ఉంది. సినిమాల పేరిట యువతులను బలవంతం చేసి అశ్లీల వీడియోలు షూట్ చేయించారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనపై గతంలో పోలీసులు కేసు నమోదు చేశారు. కొద్దిరోజులపాటు జైలులో ఉన్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా కుంద్రా తన పేరిట ఉన్న ఆస్తులను తన వైఫ్ శిల్పాశెట్టి పేరు మీదగా ట్రాన్స్‌ఫర్ చేసినట్టు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి.